వరంగల్ ఈస్ట్, జూన్ 13 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మహిళల అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని, మహోజ్వల పరిస్థితి కొనసాగుతున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సగర్వంగా చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 1,20,000కు పైగా మహిళలుండగా, వారిలో దాదాపు 90 వేల మంది వరకు స్వయం సహాయక గ్రూపుల్లో కొనసాగుతూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉర్సు గుట్ట వద్ద గల ఆకుతోట ఫంక్షన్ హాల్ లో మహిళా సంక్షేమ దినోత్సవం ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ గతంలో కేవలం స్వయం సహాయక సంఘాల్లో 8,742 మంది మాత్రమే ఉండగా, ఇప్పడు 8,934 గ్రూపుల్లో 89,340 మంది వరకు సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక గ్రూపులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లు చెప్పారు. గతంలో 3,643 మంది మహిళలు వీధి వ్యాపారంలో కొనసాగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 39,829కి చేరిందన్నారు. ఈ క్రమాన్ని పరిశీలిస్తే ఆడపడుచులు పెద్ద సంఖ్యలో చిన్న వ్యాపారాల్లోకి ప్రవేశించిన విషయం అర్థమవుతున్నదన్నారు. మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అసామాన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రూపాయి ఖర్చు కాకుండా విద్య, వైద్యం, పౌష్టికాహారంతో పాటు కల్యాణలక్ష్మితో పాటు కేసీఆర్ కిట్, ఉచిత ప్రసూతి, అమ్మాయి పుడితే రూ. 13 వేలు, ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చి పోయేందుకు వాహన సౌకర్యం, ఒంటరి మహిళలకు ఆర్థికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. బాలికలు, మహిళల గురుకుల పాఠశాలలు నాలుగు, మైనార్టీల ఆడపిల్లల కోసం రెండు గురుకులాలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1.20 లక్షలు వారి చదువుకోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. సీఎం కప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో బాలికలు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు పతకాలను గెలుపొంది తూర్పు నియోజకవర్గానికి వన్నె తెచ్చినట్లు చెప్పారు. జిమ్నాస్టిక్స్ లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ తో పాటు షటిల్ లో రజత, కాంస్య పతకాలను గెలుపొందినట్లు తెలిపారు. హ్యాండ్ బాల్ లో ముగ్గురు అవార్డులు సాధించడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని క్రీడల్లో రాష్ట్రస్థాయిలో ముందు నిలపడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి తూర్పు నియోజకవర్గంలో 90 శాతం మేరకు నిరుపేదలున్నట్లు చెప్పారు. గత పాలకులు ఇక్కడి ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన పిదప ఆర్పీలకు గౌరవ వేతనం రూ. 2000 ఇప్పించడంలో తాను క్రియాశీలకంగా పనిచేసినట్లు చెప్పారు. గతంలో బుక్కులు రాస్తే మాత్రమే నామమాత్రంగా రూ. 1200 వచ్చేవని, కాని కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి రూ. 4000 వేతనం అందజేస్తున్నట్లు చెప్పారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాలు ఏ మేరకు పెరిగాయో అందరికీ తెలిసిందేనన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలువుతున్నాయని ఆయన పేర్కొంటూ తూర్పు నియోజకవర్గంలో కార్పొరేషన్ ఎన్నికల్లో 70 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా అధికారులు శారద, రేణుక, జయశ్రీ తదితరులు మన నియోజకవర్గానికి చెందిన వారేనని ఎమ్మెల్యే నరేందర్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, ఆర్డీవో మహేందర్ జీ, డీడబ్ల్యువో శారద, మెప్మా పీడీ రేణుక, డిప్యూటీ ఎస్ వో ఇందిర, సీడబ్ల్యుసీ చైర్ పర్సన్ వసుధ, సీడీపీవో విశ్వజ, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, కావేటి కవిత రాజు యాదవ్, బోగి సువర్ణ, బస్వరాజు శిరీష, గుండు చందన, ముస్కమల్ల అరుణ, పోశాల పద్మ, ఓని స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.




