Wednesday, 4 November 2026

గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య లక్ష్మి పథకానికి నీతి ఆయోగ్ ప్రశంసలుజిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

జనంసాక్షి, మంథని : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు జీవిత కాలంలో ప్రతి దశలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందిస్తూ అనీమియా నివారణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకానికి నీతి ఆయోగ్ ప్రశంసలు లభించాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మంథనిలోని ఎస్ఎల్బి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం అమలులో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పాలు, గుడ్డుతో పౌష్టికాహారం అందించడంతో పాటు, పుట్టిన పిల్లలు ఎదుగుదలకు బాలామృతం ప్లస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రులలో వంద శాతం ప్రసవాలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే ప్రసవాలు మన జిల్లాలో 30 నుంచి 70 శాతానికి పెరిగాయని అన్నారు.
బాలికల విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసిందని ,కస్తూరి బా విద్యాలయాలను బలోపేతం చేసిందని అన్నారు. ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీం బృందాలను ఏర్పాటు చేసి , ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ద్వారా నిరంతర నిఘా పెట్టిందని అన్నారు. ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కుల, మతాలకతీతంగా కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ కింద ఒక లక్షా 116 సహాయం అందిస్తున్నదని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రతి దశలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం అర్హులకు పారదర్శకంగా అందిస్తుందని, పథకాలను మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ , ప్రజాప్రతినిధులు, సి.డి.పి. ఓ. తోట పద్మశ్రీ,, అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.