అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలి
జహీరాబాద్ డిసెంబర్ 8 (జనంసాక్షి) స్థానిక పరిశ్రమల నుండి తీసుకున్న ఫండ్ తో ఏం అభివృద్ధి చేశారు, నిధులు ఎక్కడికి మళ్ళించారో స్పష్టమైన శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి జంగం గోపి అన్నారు. పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ జంగం గోపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మండలాల గ్రామాలలో గడపగడపకు తిరిగి, ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. మంత్రి తీరు వల్ల జహీరాబాద్ నిధులు, స్థానిక ఉద్యోగాలు, సిద్దిపేట పాలవుతున్నాయి అన్నారు. సి.ఎస్.ఆర్ ద్వారా స్థానిక పరిశ్రమల నుండి తీసుకున్న ఫండ్ తో ఏం అభివృద్ధి చేశారు, నిధులు ఎక్కడికి మళ్ళించారో స్పష్టమైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులో శ్వేత పత్రం విడుదల చేయకుంటే సిబిఐకి లేఖ రాయనున్నట్టు జంగం గోపి తెలిపారు. స్థానిక రైతులు పరిశ్రమలకు భూములు ఇస్తే ఉద్యోగాలు ఇతర ప్రాంతాలకు వారికి వెళ్తే లోకల్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. స్థానిక నియోజకవర్గంలో సుమారు 40,000 మంది యువత ఉన్నారని , 30,000 మందికి ఉద్యోగాలు రాక నిరాశతో ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగాలతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జంగం గోపి అధికారంలోకి వస్తే సిఎస్ఆర్ నిధుల నుండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని అన్నారు. దిగ్వాల్ గ్రామంలోని పిరమిల్ కంపెనీ ద్వారా వచ్చే వ్యర్ధాల వల్ల స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నాయకుల అధికారులు పట్టించకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి ద్వారా రైతుల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వక్స్ బోర్డ్, అటవీ శాఖ భూములపై రైతులను భయపెట్టి ఇబ్బందులు చేస్తున్నారని, త్వరగా విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్ బిజెపి ప్రభుత్వం గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని, తాను కూడా గెలుపు గుర్రాన్ని అని స్పష్టం చేశారు. అధిష్టానం బలమైన అభ్యర్థికి టికెట్ ఇస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ రాకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ తనపై కుట్రలు చేస్తున్నాయని త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, జనవరి నుండి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్,నరేశ్,సంగమేశ్వర్, రాములు, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలి




