జనంసాక్షి, మంథని : రాష్ట్రంలోని పేద వర్గాల సంక్షేమం, అభివృద్దే బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా మంథని పట్టణంలోని ఎస్ఎల్బి గార్డెన్స్‌లో నిర్వహించిన సంక్షేమ పథకాల సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృధ్ది సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఏనాడు పేద వర్గాల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదన్నారు. మంథని నియోజకవర్గంలో సైతం 40 ఏండ్లు అధికారంలో ఉన్న ఒక్క కుటుంబం ఈ ప్రాంత పేద ప్రజల అభివృద్దిని పట్టించుకోలేదని, ఒక్క కుటుంబ పాలనతో అనేక గ్రామాల్లోని పేద ప్రజలు ఇంకా పూరి గుడిసెల్లోనే ఉంటున్నారని, ఇందుకు గత పాలకులు కారణం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగేండ్లతో నియోజకవర్గంలోని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చామని, ఇంకా అర్హత ఉన్న పేదవర్గాలకు అందించాలని ఆలోచన చేసినా ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు, కుర్చీల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న ఎమ్మెల్యే మంథనిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస పార్టీ అనేక హమీలతో మానీఫెస్టో ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఈనాడు లేనిపోని కొర్రీలు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మహిళల ప్రయాణాలు పల్లెవెలుగుకు పరిమితం చేసిన అక్కడి ప్రభుత్వం కేవలం 60కిలోమీటర్ల పరిధి మాత్రమేనని చెబుతున్నారని, ఉచిత కరెంటు ఇస్తామని 250యూనీట్లలోపు వినియోగించుకున్న వారికేనని చెప్పడం ప్రజలను మోసం చేసినట్లు కాదాఅని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు అబద్దాల మానీఫేస్టోలు ప్రకటించలేదని, సాధ్యం కాని పథకాలను చెప్పలేదన్నారు. అంతేకాకుండా ప్రజలకు చెప్పకుండానే వారికి ప్రయోజనం చేకూరే పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మన బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు ఆనాడు ప్రభుత్వం అందించే సాయానికి రెట్టింపు స్థాయిలో ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలుసుకోవాలన్నారు. ఆనాడు రూ.60వేలు అందించి ఐదు దేశాలకు మాత్రమే అనుమతి ఇస్తే ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.50లక్షల అందిస్తూ పది దేశాలకు అనుమతులు ఇస్తుందని, ఈ విషయం చాలా మందికి తెలియదని ఆయన చెప్పారు. అభివృధ్ది నిరోధకుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దేశంలో రాష్ట్రంలో మంథనిలో ప్రజలను చీకట్లోనే ఉంచాలన్నదే వాళ్ల ఆశయమని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తన్నాయంటే నోట్ల కట్టలతో వచ్చి ఓట్లు దండుకుపోవాలని చూస్తారని, 40ఏండ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని, మోపపోతున్న ప్రజలను అప్రమత్తం చేసి కాంగ్రెస్ కుటిల రాజకీయాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే తమ ఆరాటమన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి అధికారం కోసం ఆరాటపడే వాళ్లకు మనమీద ప్రేమ ఎందుకు ఉంటుందని, ఈ ప్రాంతాన్ని అభివృధ్ది చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తారని అన్నారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా మీ మేలు కోరేవాడిగా ఈ ప్రాంతం కోసం నిరంతరం తపిస్తున్నామని ఆయన అన్నారు. పేదవర్గాలకు ప్రభుత్వపరంగా తనవంతుగా సాయం చేయాలనే ఆరాటం ఉందని, అబద్దాలతో మోసం చేసే వారి నుంచి రక్షించాలన్నదే తమ ఆలోచన అన్నారు. ఆనాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని, ఆనాడే అంబేద్కర్ గొప్పగా ఆలోచన చేసి సీక్రెట్ ఓటింగ్ విధానం అమలులోకి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. మనం ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేస్తే మన బతుకులు బాగుపడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలు వస్తే అబద్దాలు, మాయమాటలతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని, ఇలాంటి మాటలకు మోసపోవద్దని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో మంథని ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేయాలన్నదే తన ఆలోచన అని ఈసందర్బంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కుమార్‌దీపక్, తహశీల్దార్ బండి ప్రకాష్, ఎంపీడీఓ రమేష్, ఎంపీపీలు జెడ్పీటిసిలు, పీఏసీఎస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
అభివృధ్ది.. సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం – దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




