Tuesday, 3 November 2026

అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

భారీ వర్షాలతో అప్రమత్తం అయిన కాశ్మీర్‌ ప్రభుత్వం

శ్రీనగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): శనివారం మధ్యాహ్నానికి అమర్‌నాథ్‌ యాత్రను పునఃప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా యాత్ర జరిగే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం నాటికి వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో యాత్రను పునః ప్రారంభించారు. బత్లాల్‌, పహల్గామ్‌ మార్గాల్లో భక్తులు యాత్రను మళ్లీ మొదలుపెట్టారు. దీంతో పాటు వాయుమార్గం ద్వారా కూడా యాత్రికులను చేరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అమర్‌నాథ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. యాత్ర ప్రారంభమైన తర్వాత ఇలా చేయడం ఇది రెండోసారి. భారీ వర్షాల కారణంగా జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జీలం నది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక శిబిరాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. జమ్మూకశ్మీర్‌ ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజోరీ జిల్లాలోని దర్హాలీ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. అటు శ్రీనగర్‌ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జేలం నది సైతం పొంగి పొర్లుతోంది. దీంతో శ్రీనగర్‌ సహా పలు జిల్లాలో జనాన్ని అలర్ట్‌ చేశారు. స్కూల్‌, కాలేజ్‌ లు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప జనం బయటకి రావద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రికులకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుకు కదలలేని పరిస్థితి ఎదురవుతోంది.

—————–