బిచ్కుంద ఏప్రిల్ 14 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదోడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణతారా మద్నూర్ మండలకేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల హామీలో అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రూపాయలు ఐదు లక్షలతో కట్టిస్తామని నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల తర్వాత ఆ హామీని మరిచిపోయి మళ్లీ 2018 ఎన్నికలలో అదే హామీని పునరావృతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జుక్కల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గంగా ఉందని, ఇప్పటివరకు రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో సెంటర్ లైటింగ్ లేని నియోజకవర్గం ఉందంటే అది జుక్కల్ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చని దుయ్యబట్టారు. అధికార పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడి ఎమ్మెల్యే తనకు తాను మూడు నాలుగు ఇళ్ళను నిర్మించుకుంటున్నారే తప్ప పేదలకు ఇల్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కళ్ళకు కనిపించడం లేదా అని ఆగ్రహము వ్యక్తం చేశారు. ఏ విషయంలో అయినా గాని ఇక్కడి ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులకే మేలు జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేలూర్ సర్పంచ్ నీలావతి హనుమాన్లు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణ పటేల్, మండల ప్రధాన కార్యదర్శులు హనుమాన్లు, వీరేశం, భాజపా జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకట్ కాలే, తిప్పవారి తుకారం, విష్ణు, మల్లికార్జున్ దేశాయ్ మరియు భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




