Wednesday, 4 November 2026

అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి

 

 

 

 

హుజూర్ నగర్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి): అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశం అధ్యక్షులు తంగిళ్ళ వెంకట్ చంద్ర అధ్యక్షతన జరిగింది. శనివారం అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మండల వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మండలంలోని బూరుగడ్డ (మాసారం )గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తయి సంవత్సరాలు గడుస్తున్న పంపిణీకి నోచుకోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలు దరఖాస్తులు పెట్టుకున్నారని, కాని నేటికీ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న సీతారాంపురం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి అర్హులకు ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఇండ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇచ్చి పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి స్థలం ఉన్నవారికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారని, ప్రభుత్వం తక్షణమే పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. పేదలకు సొంత ఇల్లు లేకపోవడం వల్ల తాము చేసిన కష్టంలో అధిక భాగం ఇంటి అద్దెలకే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని లేనియెడల మండల వ్యాప్తంగా సర్వే చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చింతకుంట్ల వీరయ్య, నూకల లక్ష్మీనరసింహ, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, చందాల బిక్షం, షేక్. ఖాసిం, సిద్ధిల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు