Tuesday, 3 November 2026

అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి – సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్

హుజూర్ నగర్ జులై 1 (జనంసాక్షి): అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జులై 3న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాకు పేదలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఎం పార్టీ హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ పిలుపునిచ్చారు. శనివారం హుజూర్ నగర్ మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని పేద ప్రజలు ఇండ్ల స్థలాలు, సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూరుగడ్డ గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయి ఉన్న ఇండ్లను పేద ప్రజలకు ఇవ్వాలని వారు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు గృహలక్ష్మి పథకం కింద ఐదు లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. మండల వ్యాప్తంగా స్థానిక సమస్యలపై జులై 3న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులకి ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మాడురి నరసింహ చారి, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, మీగడ రాములు, చింతకుంట వీరయ్య, చందాల బిక్షం, సిద్దిల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.