– సెలబ్రిటీలు ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలి
– రాష్ట్ర మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే24(జనం సాక్షి) : ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా క్యాన్సర్ ను నిర్మూలించ వచ్చని, ఈ మేరకు ప్రభుత్వం కృషిచేస్తుందని, సెలబ్రిటీలు కూడా ముందుకొచ్చి క్యాన్సర్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం బసవతారక ఆసుపత్రిలో అడ్వాన్స్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లంటేషన్ యూనిట్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బసవ తారక ఆసుపత్రి బయట షెల్టర్స్ ను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని షెల్టర్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. క్యాన్సర్‌ను అవగాహనతో నిర్మూలివంచవచ్చునని క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సెలబ్రెటీస్ ముందుకొచ్చి క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచవచ్చునని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు. బసవతారక ఆసుపత్రి పన్ను రద్దు చేయాలని పదేళ్లలో ముగ్గురు సీఎంలను అడిగినా చేయలేదని, సీఎం కేసీఆర్ పన్ను రద్దు చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. దీనిలో బాగంగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వసతి సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీనికితోడు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. జూన్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే యోచనలో కేసీఆర్ ఉన్నారని, ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. అన్ని విధాలుగా పేదల వైద్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. తొలుత ఎన్టీఆర్ దంతుల విగ్రహాలకు కేటీఆర్ పూలమాలల వేసి నివాళులర్పించారు. అనంతరం సినీ నటుడు, ఎమ్మెల్యే, బసవతారక ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ చేతుల విూదుగా బీఎంటీ యూనిట్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో కేసీఆర్ తన కుమారుడికి కేటీఆర్ అని పేరు పెట్టడం సంతోషకరమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. 40 బెడ్స్‌తో ప్రారంభమైన క్యానర్స్ ఆస్పత్రి.. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందంటే దానికి వైద్యుల కృషి ఎంతో ఉందని బాలయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అవగాహనతో క్యాన్సర్‌ను నిర్మూలించగలం




