Wednesday, 4 November 2026

అవినీతికి పాల్పడుతున్న సభ్యులను తొలగించాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

 

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, మే 25 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, ధరూర్ మండలంలోని ఉప్పేరు గ్రామంలో గీత పారిశ్రామిసంఘంలోని సభ్యులు కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా వారిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామానికి చెందిన రాఘవ గౌడ్ ఆరోపించారు. దీనిపై గత నెల 13న ఎక్సైజ్ సీఐకి సొసైటీ అధ్యక్షులు, సభ్యులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇందుకు సంబంధించి రాఘవ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పేరు గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న నరేష్ గౌడ్, తిమ్మప్ప గౌడ్, వెంకటేష్ గౌడ్, రవీందర్ గౌడ్, విజయ్ చందర్ గౌడ్, భగవంత్ గౌడ్, నర్సింహులు గౌడ్ లు ఉప్పేరు, ఖమ్మంపాడు, నర్సన్ దొడ్డి, వామన్ పల్లి, జీరబండ గ్రామాల్లో ఎలాంటి ఈత వనాలు లేకున్నా, వారిలో ఏ ఒక్కరికి గీత గీయడం రాకున్నా స్వయంగా వారే కల్తీ కల్లు తయారు చేసి అక్రమ దందాకు తెర లేపారని అన్నారు. ఈ విషయంపై గద్వాల ఎక్సైజ్ సిఐకి ఫిర్యాదు చేస్తే వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, వారిని వెనుక ఉండి మరీ ప్రోత్సహిస్తూ సంఘంలోని సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. దీనిపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులుకు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యం అని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సంఘం సభ్యులు, వారిని ప్రోత్సహిస్తున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడంతోపాటు అవినీతికి పాల్పడే సభ్యులను సంఘం నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం ఎక్సైజ్ అధికారులకు మరోసారి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని రాఘవ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.