Monday, 2 November 2026

ఆకాశాన్నంటిన కూరగాయలు ధరలు

yfma6jujహైదరాబాద్: కొనబోతే కొరివి…అమ్మబోతే అడవి…అన్నట్టు కూరగాయల ధరలు రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. అసలే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు కూరగాయల ధరలు గోటి చుట్టపై రోకటిపోటులా పరిణమించాయి. కాని ప్రభుత్వానికి పెరుగుతున్న కూరగాయల ధరలు కనిపించకపోవడం శోచనీయం.
హోల్‌సేల్, రిటైల్ ధరలకు లేని పొంతన
టమాటా, బీన్స్, క్యారెట్, క్యాప్సికం కాదేదీ.. ధరల పెరుగుదలకనర్హం అన్నట్లుంది కూరగాయల పరిస్థితి. సరఫరాల మధ్య సగానికిపైగా అంతరం ఏర్పడటంతో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలొవచ్చాయి. హోల్‌సేల్ మార్కెట్లో, రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు.
ధరల ధాటికి విలవిల్లాడుతున్న సామన్యుడు
టోకు మార్కెట్లో కేజీ 52 రూపాయలు ఉన్న టమాటా బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. పచ్చిమిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర, ఉల్లి వంటివాటి ధరలు కూడా టమాటానే అనుసరిస్తుండటంతో జనం కొనాలంటేనే భయపడిపోతున్నారు. ధరలకు కళ్లెం వేయాల్సిన సంబంధిత శాఖ చూసి చూడనట్లు వ్యవహారిస్తుండటంతో ధరల ధాటికి సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వేసవిలో సూర్యుడి తాపానికి బెంబేలెత్తుతున్న ప్రజలకు కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో మరింత భయ పెడుతున్నాయి.
నాలుగురకాల కూరగాయలకు రూ.200
వారం రోజుల వ్యత్యాసంలో కూరగాయల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. పావు కిలో కూరగాయలు కొనుగోలు చేయాలన్నా ధరలు భగ్గు మంటున్నాయి. సామాన్యులు ఇంతటి ధరలను భరించే స్థాయి లేదు. వర్షాలు పడితే తప్ప కూరగాయల ధరల్లో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నాలుగు రకాల కూరగాయలు కొనుగోలు చేస్తే 200 కు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సామాన్యులకు ఇబ్బంది తప్పడం లేదు. మరో వైపు టన్నుల కొద్ది మార్కెట్‌కు వచ్చే కూరగాయల సగానికి పైగా తగ్గుముఖం పట్టాయి.
రూ.40కి చేరుకున్న టమాటల ధర
వారంక్రితం టమాటా ధర కిలోకి 10 నుంచి 15 వరకు ఉండగా ప్రస్తుతం ఏకంగా 40 రూపాయలు పలుకుతోంది. వంకాయ 15 రూపాయల నుంచి 30, బెండకాయ 15 నుంచి 40కి పెరిగింది. దొండకాయ 15 నుంచి 25, కాకరకాయ 30 నుంచి 45, బంగాళ దుంప 20 నుంచి 30, కొత్తిమీర, దోసకాయ 15 నుంచి 40, క్యారెట్‌ 30 నుంచి 45, రెండు ములక్కాయలు 10 రూపాయాలు . పచ్చిమిర్చి 30 నుంచి 60, బీరకాయ 30 నుంచి 45, సొరకాయ 10 నుంచి 30, క్యాప్సికం 40 నుంచి 60, క్యాబేజీ 15 నుంచి 30, క్యాలీఫ్లవర్‌ 15 నుంచి 25, ఉల్లిగడ్డ ధర కిలోకి 30 నుంచి 40 పలుకుతుంది. ఇక కొత్తిమీర , పుదీనాలతో పాటు ఆకుకూరల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. చల్లదనానికి మారు పేరుగా ఉన్న నిమ్మకాయ మరింత వేడెక్కుతుంది. పదికి రెండు నిమ్మకాయలు అమ్ముతున్నారు. ఇలా వారం రోజుల వ్యవధిలోని కూరల ధరలన్ని రెట్టింపయ్యాయి.
దళారుల ప్రమేయంతో ధరలకు రెక్కలు
అనుకున్నంతగా వర్షాలు లేక పోవడం, ఆశించిన స్థాయిలో కూరగాయల సాగు జరగక పోవడం అధిక ధరలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు దళారుల ప్రమేయంతో కారణంగా ధరలకు రెక్కలు వచ్చాయి. అసలే కరువు పరిస్థితులు. ఆపై వర్షాలు లేక పంటలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు అధిక ధరలకు కూరగాయలు కొనుగోలు చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన వ్యవసాయ శాఖ, హర్టికల్చర్ వారు పట్టించుకోక పోవడం కూడా ధరల పెరుగుదలకు బాధ్యత వహించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *