ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు
` ఇక పండుగ పూట ప్రజలకు పస్తులే..
` మండిపడ్డ ప్రియాంక
దిల్లీ(జనంసాక్షి): ధరల పెరుగుదల అంశంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రజలు దీపావళి ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై మోదీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఉల్లిపాయలు, చక్కెర, పప్పుల ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ ప్రియాంకా గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు.‘‘దీపావళి వారం రోజులే ఉంది.. కానీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరగడం మొదలైంది. అదే సమయంలో భారతదేశం ఉల్లిని ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం. గతేడాది రైతు సోదరులు 31లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని ఉత్పత్తి చేశారు. అదంతా ఎక్కడుంది? ఆ బడా వ్యాపారి గిడ్డంగిలోనా? లేదంటే నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ గోదాముల్లోనే కుళ్లిపోయిందా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు. మరోవైపు, చక్కెరతో పాటు పప్పులు సైతం పౌరులకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లేం తింటారు.. మిగతా వాళ్లకు ఏం పెడతారు? ఈ దీపావళి పండుగను ప్రజలు ఎలా సంతోషంగా చేసుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.