జనంసాక్షి , కమాన్ పూర్ : అధికార పార్టీ నాయకులు తమ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలపై పెట్టిన దృష్టి రైతులపై పెట్టాలని కమాన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు అన్నారు . మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాను ప్రకారం అకాల వర్షంతో కమాన్పూర్ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా శాలపల్లె, రొంపికుంట, పేరపల్లి గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతులు పడుతున్న బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనాల మీద పెట్టిన దృష్టి కమాన్పూర్ రైతాంగ కన్నీళ్ల మీద కూడా పెట్టాలని, 21 తారీకు నాడు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు 26 తారీకు వరకు కూడా వరి కొనుగోలు కేంద్రాలలో తూకం ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వరి కొనుగోలు కేంద్రాలలో కనీసం ఒక్క టార్పాలిన్ కూడా ఎందుకు ఉంచడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు జనాలను తరలించినటువంటి నాయకులు రైతులు అకాల వర్షం వలన నీట మునిగిన పంట కోసం ఎదురు చూస్తుంటే ఎందుకు కొనుగోలు కేంద్రాల సందర్శన చేయడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని, తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న ఏవో ఎందుకు టోకెన్ ఇవ్వడం లేదని, కమాన్పూర్ ఏవో కు రైస్ మిల్లులకు ఉన్న సంబంధం ఏంటిది అని రైతుల పక్షాన ఏవో ని సంప్రదిస్తే.. 21 తారీకు నుంచి 26 తారీకు వరకు ఎందుకు టోకెన్ ఇవ్వలేదని అడిగితే ఏందీ కలెక్టర్కు చెప్పుకుంటారా ..చెప్పుకో పో అనే అని దురుసుగా సమాధానం చెప్పారని, అంత అధికారం ఏవోకు ఎక్కడిది అని, ఏవో ప్రమోద్ కుమార్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రైతులను చులకనగా మాట్లాడిన ఏవో పై కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. టిఆర్ఎస్ నాయకులు ఎందుకు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎందుకు భరోసా కల్పించడం లేదని, 21 తారీకు నుండి ఈ ఐదు రోజుల్లో కొనుగోలు చేసినట్లయితే ఒక్క గింజ కూడా తడిచే అవకాశమే లేదు అయినా ఈ ఐదు రోజులు కాంటాలు పెట్టకపోవడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. కాంటాలను వెంటనే ప్రారంభించి, గింజ కూడా ఎక్కువ తూకం వేయకుండా కొనుగోళ్లు చేపట్టాలని, తూకంలో కోతలు విధిస్తే రైతుల పక్షాన రైతులతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రొంపి కుంట పేరపల్లి సర్పంచులు కటకం రవీందర్, తొగరి అన్నపూర్ణ, గ్రామ సర్పంచ్ కటకం రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, జూలపల్లి ఎంపీటీసీ శివ శంకరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ మూర్తి , నాయకులు భూస తిరుపతి బొజ్జ సతీష్, నరేందర్, కుక్క రవి, మామిడి రాజు, రాయ మల్లు, కటకం నారాయణ, కమ్మ గోని మల్లయ్య, గుమ్మడి వెంకన్న గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




