Sunday, 8 November 2026

ఆదివాసీలకు మెరుగైన వైద్య సేవలు: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

ఆదివాసీలకు మెరుగైన వైద్య సేవలు: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

* గుడిహత్నూర్: డిసెంబర్ (22 జనం సాక్షి)ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటిడిఏ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం గుడిహత్నూర్ మండలం ధరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు వచ్చిన పిఓ కు డప్పు వాయిద్యాలతో, మహిళల నృత్యాలతో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. హనుమాన్ మందిరంలో పిఓ ప్రత్యేక పూజలు నిర్వహించి, అంగన్వాడీ కేంద్రం చిన్నారులతో మాట్లాడారు. గర్భిణులకు, బాలింతలకు, విద్యార్థులకు కేంద్రం ద్వారా అందిస్తున్న పోషకాహారం వివరాలను ఉపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించి, అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామా సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి పిఓ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రత్యేకమైన అన్నారు. చదువు తోపాటు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు వాగుపై వంతెన, త్రి ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గిరిజన రైతులు లాభసాటి పంటలు సాగు చేసి ఆర్థిక అభివృద్ధి సాధించాలని అన్నారు. సీఎం గిరి వికాసం పథకంలో బోరుబావులను మంజూరు చేస్తామని మామిడి, జామ, సీతాఫలం వంటి పండ్ల తోటలతో పాటు చిరుధాన్యాలను పండించాలని అన్నారు. వ్యవసాయ భూములు గుట్ట ప్రాంతంలో ఉన్నందున ఈజీఎస్ పథకంలో భూగర్భ జలాలు పెరిగేలా ఈజి ఎస్ క్రింద పామ్ ఫండ్ ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రెటరీ ఆదేశించారు. గిరిజనుల జీవనోపాధికి ఐటిడిఎ ద్వారా మేకలు, ఆవులతో పాటు స్వయం ఉపాధి పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలలో రక్త హీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. శిబిరంలో ప్రతి ఒక్కరు వైద్య చికిత్సలు తీసుకోవాలని డయాబెటిక్, షుగర్, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి వాటికి డాక్టర్ల సూచనలతో మందులు వాడాలని సూచించారు. వైద్యశిబిరం ఏర్పాటుకు కృషి చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం దుర్గా అనే గర్భిణీకి కేసిఆర్ న్యూట్రిషన్ కిట్టును పిఓ అందించారు. అనంతరం గిరిజన మహిళలు చిరుధాన్యాలతో చేసిన వంటలను రుచి చూసారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ మనోహర్, డాక్టర్ సాధన, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మధుసూదన్, సుమనస్పతి రెడ్డి, అశోక్, దయానంద్, దేవన్న, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి శృతి, డాక్టర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.