ఆదివాసీల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం


గిరిజనుల వెనకబాటును తొలగిస్తున్న కెసిఆర్‌
మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన కలను సాకారం చేసారు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. ఆదివాసులకు అన్ని మౌళికవసతులు కల్పించడానికి రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తుందని వెల్లడిరచారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ’మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారని, ప్రత్యేకంగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తున్నరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు స్వావలంబన ప్రసాదించే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క`సారలమ్మ జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికిగా చెప్పుకునేలా ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా ఘనంగా జరపడంతో పాటు జోడేఘాట్‌ అభివృద్ధికి రూ.25 కోట్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిం చిందన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్నదని వెల్లడిరచారు. నాగోబా ఆలయ విస్తరణ, దర్భార్‌ నిర్మాణం, రోడ్ల అభివృద్దికి నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.