శివ్వంపేట మే 9 జనంసాక్షి : జిల్లావ్యాప్తంగా ఆరోగ్య మహిళకు విశేష స్పందన లభిస్తుందని ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఆరోగ్య మహిళకు 3862 మంది రిజిస్టర్ అయ్యారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు చేస్తున్న వివిధ రకాల వైద్య పరీక్షల వివరాలను పిహెచ్ సి డాక్టర్లను అడిగి తెలుసుకొని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు, సిబ్బంది, అలాగే రోగుల హాజరు రిజిస్టర్ల తోపాటుగా పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళలను పరామర్శించి, వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆరోగ్య మహిళా కేంద్రాలపై ఎపిఎంలు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఎఎన్యంల ద్వారా పలు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 6 కేంద్రాలను మహిళలు చక్కగా వినియోగించుకుంటున్నారని , వారి నుండి మంచి స్పందన లభిస్తున్నదన్నారు. పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే ఇట్టి క్లినిక్ లలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 18 ఏళ్ళు పైబడిన ప్రతి మహిళకు 8 రకాల వ్యాధులపై అవగాహన కలిగించి వారిలో ఉన్న సమస్యలను ముందే తెలుసుకొని ఆరోగ్య మహిళా కేంద్రానికి తీసుకువచ్చిపరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రానికి రెఫర్ చేసిన కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి ఫాలో అప్ చేయాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ హితబోధ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,852 మంది మహిళలు రిజిస్టర్ కాగా 1,456 మంది నుండి శాంపుల్స్ సేకరించి డయాగ్నస్టిక్ పరీక్షల కోసం పంపడం జరిగిందన్నారు. త్వరలో జిల్లాలో మరో 8 ప్రాంతాలలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఇందుకు సంబందించిన సిబ్బంది హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు.
ఈ సమయంలో తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఉప తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్ఐ కిషన్, పిహెచ్ సీ వైద్యాధికారులు సాయి సౌమ్య, సంధ్య, డిఈఓ సంతు మాధురి, సూపర్ వైజర్ విజయలక్ష్మి, స్టాప్ నర్సు స్రవంతి, రాధిక లతో పాటు ఏఎన్ఎం లు తదితరులు ఉన్నారు.




