Wednesday, 4 November 2026

ఆర్టీసీని కాపాడండి!

– తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన
– ర్యాలీలు, నిరసనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
– డిపోల ఎదుట బైఠాయించిన కార్మికులు
– షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌
– ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలపై హైకోర్టులో విచారణ
– 27కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్‌,నవంబర్‌25( జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కారు. నిరసనలు, ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మె వరుసగా 52వ రోజు మంగళవారం ఉధృతంగా సాగింది. ‘సేవ్‌ ఆర్టీసీ’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. అన్ని డిపోలు, బస్టాండులు, ప్రధాన కూడళ్లలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీని కాపాడండి అంటూ కరీంనగర్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండు నుంచి ఆచార్య జయశంకర్‌ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడే మానవహారం చేపట్టారు. సమ్మెలో భాగంగా
జగిత్యాల డిపో ఎదుట జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. నివాళులర్పించిన అనంతరం ఆందోళన నిర్వహించారు. యాదాద్రి బస్టాండ్‌ ఎదుట కార్మికులు ఆర్టీసీని పరిరక్షించుకుందామంటూ మానవహారం, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కండక్టర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తమను విధుల్లోకి తీసుకోవాంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగం చేయడానికి వస్తే.. అధికారులు అనుమతించడం లేదంటూ డిపో ఎదుట బైఠాయించారు. భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భాగ్యనగరంలో ఆర్టీసీ అద్దె బస్సులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. పలుమార్గాల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో అరకొరగా నడుస్తున్న బస్సులు మార్గమధ్యలోనే మొరాయిస్తున్నాయి. ఫరూక్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు సీబీఎస్‌ నుంచి జీడిమెట్ల వెళ్తున్న క్రమంలో ఖైరతాబాద్‌ సిగ్నల్‌ వద్ద అర్దాంతరంగా ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని డ్రైవర్‌.. బస్సును రహదారిపైనే వదిలేసి వెళ్లిపోయాడు. అందులోని ప్రయాణికులు కిందికి దిగి.. అందుబాటులో ఉన్న వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగడంతో.. ట్రాఫిక్‌ పోలీసులు పెట్రోలింగ్‌ వాహనం సహాయంతో ఆ బస్సును ఎర్రమంజిల్‌ వరకు తరలించారు. మరోవైపు విద్యానగర్‌లోని ఎంఎ/-లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో విపక్ష పార్టీ నేతలతో తెలంగాణ ఆర్టీసీ ఐకాస సభ్యులు సమావేశమయ్యారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, తెదేపా నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, వామపక్షనేత పోటు రంగారావు తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ ఐకాస భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగంలో చేరేందుకు ఐకాస ప్రతిపాదించినా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై నేతలు సమాలోచనలు చేసినట్లు తెలిసింది.  కేంద్రమంత్రులను కలిసే ఆలోచనపైనా చర్చించారు. దీనికోసం ఇప్పటికే కేంద్రమంత్రుల అనుమతులు కోరినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో కేంద్రాన్ని కలిసి సమస్యను
వివరించేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది.
ఆర్టీసీ జీతభత్యాలపై 27కు విచారణ వాయిదా..
ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే అడ్వకేట్‌ జనరల్‌ అందుబాటులో లేరని, కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన పిటిషనర్‌ మాట్లాడుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటివరకు 30 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు బుధవారం పూర్తి వాదనలు వింటామని పేర్కొంటూ.. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. మరోవైపు అర్హత, అనుభవం లేని ఆర్టీసీ డ్రైవర్లతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 90 రోజులు శిక్షణ ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.