Tuesday, 3 November 2026

ఆర్థికస్థోమతలేని విద్యార్ధులకు ఫీజులు భరిస్తం – పట్టుదలతో చదువుకుని కన్నవారి కలలకు సాకారం చేకూర్చాలే – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

 జనం సాక్షి, మంథని : పేద విద్యార్దుల భవిష్యత్‌ కోసమే నిరంతరం ఆలోచన చేస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. మంథని మండలం మల్లెపల్లిలోని ప్రభుత్వ డిగ్రి కళాశాలలో నిర్వహించిన కళాశాల క్రీడా వార్షికోత్సవ వేడుకల్లో శనివారం పాల్గొని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ , మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రి కళాశాల బలోపేతానికి, విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కళాశాలను కాపాడుకోవడానికి ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ఎంతో కష్టపడుతున్నారని ఆయన అన్నారు. మంథని కేంద్రానికి దూరంగా ఉండటంతో ఎంతో విద్యార్ధులకు దూరబారం అవుతోందని, ఆర్థికబారం కూడా పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద విద్యార్ధులకు తమవంతుగా సాయం అందించాలని ఆలోచనలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కళాశాలలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసిన విద్యార్ధులకు మంచి వాతావరణం కల్పించాలనే ప్రయత్నాలుచేస్తున్నామని, ఇందుకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడి నుంచి కళాశాల అభివృద్దికి తోడ్పాటు నందిస్తామన్నారు. సింగరేణి, సీఎస్సార్‌ నిధులు, ఎన్టీపీసీ, మున్సిపాలిటీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల ద్వారా ఏమైనా నిధులు సేకరించి వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది డిగ్రి వరకు చదువుకోవాలని తపనతో వస్తున్నారో అలాంటి వారి విద్యార్ధులకు అండగా నిలుస్తామన్నారు. ప్రతి విద్యార్ధికి ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రి అవసరమని, ఏ ఉద్యోగ అవకాశాలు లభించాలన్న డిగ్రి అవసరమని ఆయన అన్నారు. డిగ్రి వరకు చదివించేందుకు ఎంతో మంది తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతుంటారని, ఇక ప్రైవేటు కళాశాలల్లో చదువుకోవడం అంటే ఎంతో భారమని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్దుల తల్లిదండ్రులకు చదువు ఆర్థికబారంలా కావద్దని ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన విద్యను అందిస్తోందన్నారు. ఆ దిశగానే తాము అడుగులు వేస్తున్నామని, పేద విద్యార్ధులకు ఉన్నత చదువు అందించేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రి కళాశాలలో చదువుకుంటూ ఆర్థిక స్థోమత లేక ఫీజులు కట్టలేని విద్యార్ధులకు రెండు సెమిస్టర్‌ల ఫీజు తాము చెల్లించి ప్రతి విద్యార్ధికి మేనమామను అవుతానని అన్నారు. ఆర్థిక స్థోమత లేక ఫీజులు కట్టలేని విద్యార్ధులకు తమ ఆఫీస్‌లో దరఖాస్తులు అందించాలని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన గత పాలకులు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ది చేశామని, విద్యాభివృద్దికి కళాశాలలు తీసుకువచ్చామని గొప్పలుచెప్పుకుంటున్నారే కానీ కళాశాలల్లో విద్యార్ధుల సౌకర్యాలను ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. కనీసం ఒక్క పేద విద్యార్ధికి సాయం చేసిన దాఖలాలు లేవని, ఆకలి విలువ తెలిసిన వాళ్లే సాయంచేయడంలో ముందుంటారని ఆయన అన్నారు. ప్రభుత్వ డిగ్రికళాశాలకు తమ వంతు సాయంగా మల్లెపల్లి గ్రామసర్పంచ్‌ ఎరుకల తిరుపతమ్మ రవిలు రూ.5 వేలు సాయం చేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు. తాము పేద విద్యార్ధులకు సాయం చేస్తుంటే దానిని విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్ధి డిగ్రి కంప్లీట్‌ చేసి గౌరవంగా బతుకాలన్నదే తన ఆకాంక్ష అని ఆ దిశగానే విద్యార్దుల భవిష్యత్‌కు సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. ప్రతి విద్యార్ధి మంచిగా చదువుకు భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్దులకు మెమోంటోలు అందజేశారు. అలాగే జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు కళాశాల ప్రిన్సిపాల్‌ తాహెర్‌ హుస్సేన్‌ మెమోంటో అందజేసి సత్కరించారు.