– ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ విఫలం
– విశాఖ ఏజెన్సీలోని ఖనిజ సంపదను గత ప్రభుత్వాలు దోపిడీ చేశాయి
– అక్రమ మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.
– తెలంగాణలో పోటీపై రెండు రోజుల్లో నిర్ణయిస్తాం
– జనసేన అధినేత పవన్ కల్యాణ్
– జనసేన తీర్థం పుచ్చుకున్న పసుపులేటి బాలరాజు
– పవన్ ఆలోచనా విధానం నచ్చి జనసేనలో చేరినట్లు వెల్లడి
విజయవాడ, నవంబర్10(జనంసాక్షి) : మన దారి సరైన దారి అయితే.. మన ఆశయాలు బలంగా ఉంటే.. బలమైన నేతలు మన వెంట వస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లా నేతలు జనసేనలో చేరారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. నానమ్మకం ఏవిధంగా ఉందో అదే విధంగా సోదరుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజును జనసేన పార్టీలో చేరేవిధంగా చేసిందన్నారు. జనసేన పార్టీ భావితరాలకు అండగా నిలబడాలని పవన్ కల్యాణ్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనేది నా ఉద్దేశమన్నారు. జనసేన పార్టీ ప్రజల్లో ఉన్న సమస్యలను సమకోణంలో చూడాలని కోరుకుంటుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓట్లు చీలి అభివృద్దికి ఆటంకం కలగకూడదనే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానన్నారు.
అటవీవాఖ రక్షణ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని పవన్ అన్నారు. విశాఖ ఏజెన్సీలోని ఖనిజ సంపదను గత ప్రభుత్వాలు దోపిడీ చేశాయన్నారు. అక్రమ మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగజేస్తే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లకు తెలిసే మైనింగ్ జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మైనింగ్ కు అనుమతులు ఇచ్చిందన్నారు. ఆర్టీజీలో విషయాలు తెలుసుకునే సీఎం చంద్రబాబుకు మైనింగ్ మాఫియా గురించి తెలియదా అని ప్రశ్నించారు. బాక్సైట్ మైనింగ్ ను ఖచ్చితంగా అడ్డుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాము ఊహించలేదన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో సమయం లేక తెలంగాణపై దృష్టిసారించలేక పోయామని, పూర్తిస్థాయిలో ఏపీలోనే కేటాయిద్దామనుకున్నామని తెలిపారు. ముందస్తు లేకుంటే 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నామన్నారు. అయితే ఇలా ముందస్తు రావడంతో డోలాయమానంలో పడ్డామని అన్నారు. తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని, ఈ మేరకు రెండుమూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎన్ని స్థానాల్లో పోటీలు చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ బలంగా ఉన్నాం అనే అంశాలను సవిూక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని పవన్ తెలిపారు.
పవన్ ఆలోచనా విధానం నచ్చి వచ్చా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో బాలరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఏ లక్ష్యంతో పనిచేయాలనుకున్నారో అందుకు తాను ముందుంటానన్నారు. ప్రజల కోసం పవన్ కల్యాణ్ చేస్తున్న ఆలోచనా విధానం నచ్చిందన్నారు. చెడును బయటకు తీయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, అందుకు తాను కూడా జనసేనలో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నట్లు తెలిపారు. పవన్ పర్యటన ద్వారా గిరిజనులు ఎలా దోపిడీకి గురవుతున్నారో బయటకి తెలుస్తోందన్నారు… ప్రభుత్వం ఎలా దోపిడీకి పాల్పడుతోంది అనేది పవన్ ప్రశ్నిస్తున్నారని… పవన్ తో పాటు కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు బాలరాజు.
ఆశయాలు బలంగా ఉంటే.. బలమైన నేతలు మన వెంటే వస్తారు




