ఆశాలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి..
– అదనపు సర్వేలకు అదనంగా డబ్బులు చెల్లించాలి.
– ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు ప్రభావతి.
ఊరుకొండ, డిసెంబర్ 5 (జనంసాక్షి):
ఆశా వర్కర్ల చేత ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించు కుంటుందని.. కష్టానికి తగినట్లుగా పనికి దగ్గ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు ప్రభావతి, కార్యదర్శి నర్మదలు డిమాండ్ చేశారు. సోమవారం ఊరుకొండ మండల ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని మండల వైద్యాధికారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ.. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి, ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, ఆశాలకు ఫిక్స్ డు వేతనం 10వేల రూపాయలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం చెల్లించిన కరోనా రిస్కు అలవెన్స్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున 16 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని, డిసెంబర్ 6 నుండి నిర్వహించే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, 2023 జనవరి 18 నుండి నిర్వహించే కంటి వెలుగు ప్రోగ్రాంకు అదనంగా డబ్బులు చెల్లించాలని, టిబి స్కూటమి డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలని, ఆశాలకు పనిభారాన్ని తగ్గించాలని, జాబ్ చార్టును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
32 రకాల రిజిస్టర్ ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలని.. ఈలోపు ఆశాలు ఖర్చు చేసిన రిజిస్టర్ డబ్బులను చెల్లించాలని కోరారు. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ లను వెంటనే ఇవ్వాలని, జిల్లా ఆసుపత్రిలో ఆశాలకు రెస్టు రూములు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 15న జరిగే కలెక్టరేట్ ఆఫీసు ముట్టడిని ఆశా వర్కర్ల అందరూ కలిసి కట్టుగా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు ప్రభావతి, కార్యదర్శి నర్మద, ఆశ వర్కర్లు వెంకటమ్మ, పుష్ప, మంజుల, జంగమ్మ, నిర్మలభాయి, మణెమ్మ, రాధ, చంద్రకళ, సుజాత, సరస్వతి, జంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆశాలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి




