Wednesday, 4 November 2026

ఆసియా కప్‌ 2023లో ఆడే టీమిండియా ఇదే! జట్టును ప్రకటించిన BCCI

 క్రికెట్‌ అభిమానుల నిరీక్షణకు తెర పడింది. ఆసియా కప్‌ – 2023 (Asia Cup 2023) కి భారత జట్టు (Team India)ను బీసీసీఐ (BCCI) ఎంపిక చేసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు నేడు న్యూఢిల్లీలో సమావేశమై ఆసియా కప్ (Asia Cup) కోసం 17 మందితో కూడిన టీమిండియా జట్టును ప్రకటించారు.

ఆసియా కప్‌లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా, హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఐపీఎల్‌లో గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) తాజాగా జట్టులోకి పునరాగమనం చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ సామ్సన్ బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma)కు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కింది.

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయష్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిధ్ కృష్ణ, సంజూ సామ్సన్ (బ్యాకప్)

ఆసియా కప్‌ – 2023 మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌ శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికగా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌-నేపాల్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఇక భారత్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 2న పల్లెకెలె వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది.