Thursday, 5 November 2026

ఆ జమానా నడవదు

 

ఆ జమానా నడవదు
– పదవులు ఎవరికీ శాశ్వతం కాదు భగవంతుడు దీవిస్తే అవే వస్తాయి
– ఇబ్బందులకు గురి చేస్తే జోలె పట్టుకుని రాజకీయం చేస్తా
– కబ్జాలు, అక్రమాలు చేయలేదు గాడ్ ఫాదర్ లేడు
– సెక్యూరిటీ ఇవ్వమని అడగలేదు ఉన్నవారిని తీసేసినా ఆడగను ప్రజాభిమానమే నాకు రక్ష
– అధికారంలో ఉన్నవారు ఇబ్బంది పెట్టడం వారి నైజం ప్రతి పద్దు నమోదై ఉంటుంది వడ్డీ సహా తీర్చాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– సోషల్ మీడియాలోనే రేగా కాంతారావు అభివృద్ధి
– పినపాకలో ఉన్నది సైకో ఎమ్మెల్యే
– నేను తెచ్చిన నిధులకు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి కోతలు కోయడం తప్ప అభివృద్ధి శూన్యం : పాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, జనవరి 10, (జనంసాక్షి) : “శ్రీనన్నకు ఏం జరిగింది ఆయనతో పాటు పయణించే నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో ఏం న్యాయం జరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గడిచిన నాలుగు సంవత్సరాలలో అధికారంలో ఎందుకు లేనో అందరికీ తెలుసు. నాది రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదు. ఏదో వేదిక మీద మనిషి ఆవేదన, ఆలోచన చెప్పాల్సిందే. మనిషి ఇన్నిరోజులుగా పడే ఆవేదన చెబితేనే కాకుల్లా గద్దల్లా పొడుచుకు తినాలని చూస్తే ఆ జమానా నడవదు. నాకు అవకాశం ఇవ్వలేదు తప్ప. నేను ఎక్కడా పోటీచేసి ఓడిపోలేదు. ప్రజలు తెలివైన వాళ్లు ప్రజల మధ్య ఎవరుంటున్నారో వారికి తెలుసు. ఒకరికి కష్టం వచ్చిందని గొంతిప్పితేనే అది నేరం అనుకుంటే అది నా వల్ల కాదు. గొంతిప్పకుండా ఆనాడు లేను ఈనాడు ఉండలేను. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు వచ్చాయి. ఆ పథకాలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలే ఆ ప్రాంతానికి రాజులుగా ప్రజలను ఏ రకంగా చిత్రహింసలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ప్రతి పద్దు ఖాతాలో జమ అయ్యి ఉంటుంది. ప్రతి మాటకు, ప్రతి పనికి ఆజ్యం ఎవరు పోశారో అది అనుభవించక తప్పదు. ఇది నేనైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారంలో ఉన్నవారికైనా. కష్టాలు ఒక మనిషికి సర్వసాధారణం. అధికారంలో ఉన్నవారు కష్టాలు పెట్టడం వారి నైజం. కష్టాలు సుఖాలు రొటీన్ వచ్చే చక్రం. భగవంతుడు దీవిస్తే పదవులు అవే వస్తాయి. వచ్చిన పదవులకు వన్నె తెచ్చుకోవాలే తప్ప పుడతా ఎవరూ పదవులతో పుట్టలేదు పదవులతో పోలేము. ఒకసారి అధికారం వచ్చాక ఏ మనిషి చనిపోయే దాక ఆ అధికారం మీద ప్రయాణించడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఏం చేశావు అని నీకు డబ్బాలు కొట్టేవారిని కాదు అడగాల్సింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలను నేను సెక్యూరిటీ కావాలని అడగలేదు. ఇబ్బందులకు గురి చేస్తే అవసరమైతే జిల్లా మొత్తం జోలె పట్టుకుని రాజకీయాలు చేసి జిల్లా ప్రజలను కాపాడుకుంటాను. ఉన్నవాటిని తీసుకున్నా ఎందుకు తీసుకున్నారు అని అడగను. లక్షలాది మంది ప్రేమించే అభిమానులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. నాకు ఏ రకమైన సెక్యూరిటీ అవసరం లేదు. వారి అభిమానాలే నాకు రక్ష. గౌరవించడం అంటే గన్మెన్లను, సెక్యూరిటీ వ్యాన్ ఇవ్వడం కాదు” అని మాజీ ఎంపీ, మాస్ లీడర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మణుగూరులోని తోగ్గూడెం సమ్మక్కసారలమ్మ ఆలయం సమీపంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరు, డిసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పై విధంగా మాట్లాడారు.

తాను ఈ రోజు నియోజకవర్గాలకు రాలేదు……

శ్రీనివాసరెడ్డికి చాలా కాంట్రాక్టులిచ్చారు. తాను పార్టీ మారలేక ఇబ్బంది పడుతున్నాడని పార్టీ మారితే బిల్లులు రావని అంటున్నారని కొందరంటున్నారు. ఎన్ని వేల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని కోట్ల కాంట్రాక్టులు శ్రీ నన్న చేశాడు. ఎవరు ఎందుకు ఇచ్చారు ఏం ఇచ్చారు అనేది త్వరలో చెబుతానని అన్నారు. కరాష్ట్రంలో ఉన్న 10 మంది పెద్ద కాంట్రాక్టర్లలో శ్రీ నన్న ఒడడు. రాజకీయాల్లోకి రాకమునుపే కాంట్రాక్టర్ నైన తాను సంపాదించిన ప్రతి పైసాకు ఇన్ కంట్యాక్స్ కట్టే పేదలకు సాయమందిస్తున్నానన్నారు. అధికారంలో ఉన్న వారి అండతో చేస్తున్న వాటికి పద్దు ఉంటుంది వాటిని తిరిగి వడ్డీతో కలిపి తీర్చాల్సి వస్తదని ప్రత్యర్థులనుద్దేశించి అన్నారు. కొందరంటున్నారు… సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తారు అని కొందరు అంటున్నారు. తాను వైసీపీలో గెలవక ముందు నుంచే పినపాక నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నానన్నారు. ఈ రొజు శ్రీనన్న రాలేదు మున్సిపల్, గ్రామ పంచాయతీల ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో శ్రీ నన్న సహకారం ఎంతుందో గ్రామాలకు వెళ్లి అడుగు తెలుస్తది. ఎన్ని కష్టాలు వచ్చినా భరించాను పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగొడిని పేద్ధోడు కొడతాడు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని మనిషిలా చూడమంటున్నాను. గౌరవించమంటున్నాను. నీకు చేతగాని పని చేసే వ్యక్తిని ఒక్కడిని చేసి మీరందరూ యుద్ధం చేయాలనుకుంటున్నారు. శ్రీనన్న ఒక్కడు కాదు. అధికార మదంతో అధికార దాహంతో పెచ్చురిల్లితే ప్రజా కోర్టులో తీర్చునిచ్చే సమయం ఎక్కువ దూరంలో లేదన్నారు. మంత్రి కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతోనే టీఆర్ఎస్ లో ఉన్నానన్నారు. నాకు బాస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రమేనని మరెవ్వరూ లేరన్నారు. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు మున్ముందు అందరితో పంచుకుంటానన్నారు.

నువ్వు చేసిన అభివృద్ధి గుండు సున్నా : మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

ఈ నియోజకవర్గంలో విద్యార్ధి దశ నుంచి ప్రతి సమస్యను అర్ధం చేసుకుంటూ…ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ… ముందుకు సాగుతున్నా… రెండు సార్లు గెలిపించారు అభివృద్ధి చేశా. ఇంతకు ముందు చేసిన వారు ఇప్పుడున్న వారు చేసింది గుండు సున్నా. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.400కోట్లు నిధులు తెస్తే ముందస్తు ఎన్నికలు రావడం వల్ల జరిగిన ఆలస్యం వల్ల ఇప్పుడు వాటికి కొబ్బరికాయలు కొడుతూ… డబ్బా కొట్టే వాళ్లతో తన సొంత సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అభివృద్ధి గుండు సన్నా అని పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఐటీఐ, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, హెల్త్ సబ్ సెంటర్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కుంటలు, చెరువులు అభివృద్ధి చేశానని వివరించారు. ఇప్పుడు నాలుగేండ్లు గడిచి ఐదో సంవత్సరం నడుస్తున్నది అయినా అభివృద్ధి శూన్యమన్నారు. రేగా చేసిన అభివృద్ధి ఎంటో చెప్పాలని ఛాలెంజ్ చేసినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు. తనపై తన అభిమాన నాయకుడిని ఉద్దేశించి అర్ధరాత్రి నిద్రపట్టక పిచ్చిపట్టి పోస్టులు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇసుక ర్యాంపులు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసి దోచుకుంటూ.. వందలాది కుటుంబాల నుంచి భూములు లాక్కుని నువ్వు నీ అనుచరులు అభివృద్ధి చెందారే తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ప్రభుత్వ విప్, రేగా కాంతారావునుద్దేశించి అన్నారు. 2013లో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభమైన తన ప్రస్థానం చివరివరకు ఆయనతోనే ఉంటుందన్నారు. వైసీపీ నుంచి అప్పటి టీఆర్ఎస్ లోకి రావాలని అధిష్టానం పంపిన నేతలు టార్చ్ ర్ చేశారు. కార్పొరేషన్ పదవులు, ఛైర్మన్లు ఇలా ఏం కావాలో కోరుకోమంటూ టార్గెట్ చేశారని, వారి ఇబ్బందులు తట్టుకోలేక అసెంబ్లీ సెషన్స్ కు గైర్హాజరయ్యానన్నారు. అయినా పొంగులేటి శ్రీనన్నను వీడిలేదన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100కు పైగా జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీలను గెలిపించి సైన్యం తయారు చేశారన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే అధిష్టానానికి గుర్తొచ్చే శ్రీనన్న సింగరేణితో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సహకారం తీసుకుని ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వదిలేశారన్నారు. రానున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి భవిష్యత్ లో ఏ నిర్ణయం తీసుకున్నా.. తన వెంటే ఉండాలని కోరగా హాజరైన ముఖ్య నాయకులందరూ ఉంటాం అంటూ జై శీనన్న అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ అంగీకారం తెలిపారు.

దద్దరిల్లిన సభ…..
ఆత్మీయ సమావేశానికి హాజరైన పొంగులేటికి ఘన స్వాగతం పలికిన నాయకులు అనంతరం గజమాలతో, శాలువాలతో, విల్లు బహూకరించి, తలకు పాగా అలంకరించి ఘనంగా సన్మానించారు. తొలి ఆత్మీయ సమావేశం నియోజకవర్గంలో నిర్వహించడంతో గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు, పినపాక, బూర్గంపహాడ్, ఆశ్వాపురం, కరకగూడెం మండలాల నుంచి వందలాదిగా తరలివచ్చారు. సభకు జై శీనన్న, జై పాయం, జై బ్రహ్మన్న అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో మువ్వా విజయబాబు, జారె ఆదినారాయణ, కేవీ రావు, పుచకాయల శంకర్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.