సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 6 :-జిల్లాలో ఈ నెల 12 నుండి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12 నుండి 20 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 10,634 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలకు 4,728 మంది విద్యార్థులు (మొత్తం 15,362 మంది) హాజరుకానున్నట్లు కలెక్టర్ తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని, పరీక్షా కేంద్రాల పరిసరాలలో గల ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా
చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సూచించాలన్నారు.
విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో ఒక ఏఎన్ఎం ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. పరీక్షా సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.
పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగ్గా రిసీవ్ చేసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, లైటింగ్, టాయిలెట్స్, తదితర మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డి ఐ ఓ గోవిందరామ్, డిఆర్ఓ నగేష్, డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




