Wednesday, 4 November 2026

సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో జనం సాక్షి, జూన్ 6 :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 7న సాగునీటి దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని, ఆ మేరకు ఆయా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లను చేసి సాగునీటి దినోత్సవంను విజయవంతం చేయాలని  జిల్లా కలెక్టర్  శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో దశాబ్ది ఉత్సవాల రోజు వారి కార్యక్రమాల నిర్వహణకు జరుగుతున్న పనులపై సమీక్షించారు.

ఈనెల 7న సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నట్లు వెల్లడించారు.  మునిపల్లి మండలం చిన్నచిన్నడ గ్రామంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల భూమి పూజ కార్యక్రమానికి మంత్రి విచ్చేస్తున్నట్లు తెలిపారు.

సాగునీటి దినోత్సవం ను పురస్కరించుకుని భారీ బహిరంగ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో పెద్ద సంఖ్య లో రైతులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొనాలన్నారు. జిల్లాలో నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని తెలియజేయాలన్నారు. ఎలాంటి లోటు పాట్లకు తావివ్వకుండా కార్యక్రమం విజయవంతం అయ్యేలా అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.

జూన్ 8న ఊరురా చెరువుల పండుగ ను నిర్వహించాలని, అన్ని గ్రామ పంచాయతీలకు చెరువులను అనుసంధానం చేయాలని, చెరువు కట్టమీద ఉన్న మైసమ్మ దేవి గుడిని విద్యుద్దీకరించాలన్నారు.

గ్రామపంచాయతీలు నీటిపారుల శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం చెరువుల పండుగ నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామంలోని రైతులు, మత్స్యకారులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు. చెరువు కట్టకు ర్యాలీగా వారి పరికరాలు, పనిముట్లతో ప్రదర్శనగా చేరుకోవాలన్నారు. ఆ దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు.

చెరువుగట్టుపై పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ముగ్గులు, తోరణాలతో అలంకరించాలని, కట్ట మైసమ్మకు ,చెరువు నీటికి పూజలు చేయాలని సూచించారు. అనంతరం సభ ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ,కోలాటాలు, పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయ్ మా ఊరు చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలన్నారు.

ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద భోజనాలు చేయాలని తెలిపారు. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబరాలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని, జిల్లాలో అమలైన అన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకోసం వెచ్చించిన నిధుల వంటి వివరాలను సభలో వివరించాలన్నారు.

జూన్ 10న  తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వాములను చేయాలన్నారు.

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు మున్సిపాలిటీలు, రెవిన్యూ డివిజన్లు, తదితర వివరాలతో కరపత్రాలను పంపిణీ చేయాలని, వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేయడంతో అందుతున్న సేవల గురించి వివరించాలని కోరారు.

ఆయా ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు పూర్తి కోఆర్డినేషన్ తో చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్ఓ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆయా జిల్లా అధికారులు, డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.