బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు: లక్ష్మణ్
హైదరాబాద్,ఏప్రిల్22(జనంసాక్షి): ఇంటర్ ఫలితాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారుల తప్పులను విద్యార్థులపై నెట్టొద్దని హెచ్చరించారు. అమాయకులైన విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన.. పాలనపై ప్రభుత్వం పట్టుకోల్పోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి చేతకాక అధికారులపై నెపం నెడుతోందని దుమ్మెత్తిపోశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలి: సిపిఐ
ఇంటర్ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్యకు సున్నా మార్కులు ప్రకటించి, మరుసటి రోజే 99 మార్కులు వచ్చాయని పేర్కొనడం ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
బోర్డు తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అవి అపోహలంటూ ప్రభుత్వం పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల జవాబు పత్రాల రీవాల్యువేషన్‌కు తల్లితండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం బోర్డు దివాళాకోరుతనానికి నిదర్శమని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బోర్డు తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే రీవాల్యువేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. శ్రీలంకలో జరిగిన మారణకాండ అత్యంత హృదయ విదారకరమైందని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ఈ దాడులు నిదర్శనమని తెలిపారు. ఈ ఉగ్రవాదుల వెనక ఉన్న ఏ దేశాన్ని అయినా ఇతర దేశాలు నిలదీయాలని సీపీఐ అభిప్రాయపడుతోందని వెల్లడించారు.
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం




