రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏ ల హల్ చల్
…… అన్నీ మేమే ……. అన్ని మావే….. ధ్రువీకరణ పత్రాలను సైతం వదలని వైనం
ప్రశ్నార్థకమవుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల పనితీరుమానకొండూరు ఆర్.సి మార్చి 1 (జనం సాక్షి)హలో… నేను మానకొండూరు రెవెన్యూ ఆఫీసు నుండి మాట్లాడుతున్నాను. నువ్వు ధ్రువీకరణ పత్రాలు కావాలని దరఖాస్తు చేసుకున్నావు కదా… .నువ్వు అలాగా ఫారం నింపితే సరిపోదు. అన్నీ తప్పుగా నమోదు చేశారు. ఇలాగైతే మీకు సర్టిఫికెట్లు రావు. పై అధికారులకు నేను సర్ది చెబుతాను. నీకు సర్టిఫికెట్ వచ్చేటట్లు చూస్తాను మీరు కూడా నన్ను చూడాలి… ఇది ఓ ఉన్నత విద్యార్హత కలిగిన వ్యక్తితో వి ఆర్ ఎ నేరుగా చరవాణిలో జరిపిన సంభాషణ. ఈ రకమైన సంభాషణ, వ్యవహారంతో ఖంగుతిన్న సదరు వ్యక్తి నిజాయితీగా విచారణ జరపండి, నేను దరఖాస్తులో నమోదు చేసిన అంశాలన్నీ వాస్తవమే… సర్టిఫికెట్ ఎలాగా మీరు ఇవ్వరో నేను కూడా చూస్తాను, ఫోను లోనే విచారణ జరుపుతారా …. అని నిలదీయడంతో మాట మార్చిన వి ఆర్ ఏ అబ్బా అలాంటిది ఏమీ లేదు… మీ తండ్రి మీ కుటుంబ సభ్యులందరూ నాకు బాగా తెలుసు, మీరు అందరూ నాకు పరిచయమే ఏదో జోక్ చేశాను అంటూ ఫోన్ కట్ చేశాడు. ఈ సంభాషణ మానకొండూరు లోని రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కొంతమంది వీఆర్ఏల చేతివాటానికి, విచారణ పేరిట అడ్డగోలు వసూళ్లకు తార్కాణం. ముంజేతి కంకణానికి అద్దమేల అన్న చందంగా కక్కుర్తి రాయుళ్ల వ్యవహార శైలికి ఇది ఓ మచ్చు తునక. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా అదరగొట్టి, బెదరగొట్టి వసూలు చేసే రారాజులు అన్నీ మేమే….. అన్నీ మావే…. అన్న రీతిగా వీరి పని తీరుతో, వ్యవహార శైలితో నిజాయితీగా విధులు నిర్వహించే మరి కొంతమంది వీఆర్ఏల చిత్తశుద్ధిని శంకించాల్సిన దుస్థితి నెలకొంది.
…. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లోనూ చేతివాటం….
మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు కావడం, అధికారుల ఫోన్ నెంబర్లు, పరిచయాలు ఉండటం తో సులువుగానే వీరి మాయాజాలంలో అమాయకులు పడిపోతున్నారు. త్వరితగతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని, కొన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించకున్నా ఏమీ కాదని మరి కొంతమందికి.. మీ భూమిలో కొంత భాగం ఫలానా వారి భూమి ఉంది. అది నాకు తెలుసు నేను పై అధికారికి చెబితే రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. లేదా అందులో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంది. అక్రమంగా మీరు భూమి కలుపుకొని సాగు చేస్తున్నారు. ఈ విషయం చెప్పి రిజిస్ట్రేషన్ ఆపివేయిస్తాను. లేదా ఫలానా డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్ళు. అతను, నేను రికార్డులు సరి చూసి పై అధికారులకు కొంత ముట్టజెప్పి, వారికి సర్ది చెప్పి రిజిస్ట్రేషన్ పూర్తి చేయిస్తాము. ఇది నా భరోసా అని డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి పంపి అక్రమ వసూళ్లకు తెరలేపటమే కాక కమిషన్ల కోసం సూత్ర, పాత్రధారులుగా మారి అక్రమంగా దండుకోవటం పరిపాటి గా మారిపోయింది. మాట వినకపోతే మరలా ఏమీ అడ్డు పుల్ల వేస్తారో అని భయపడి నయానా, భయానో వారు చెప్పిన కాడికి ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసుకుంటున్నారు కొంతమంది దరఖాస్తుదారులు. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను రెవెన్యూ కార్యాలయం నుండి విడుదల చేసే సమయంలో ట్రాక్టర్ యజమానుల వెంటపడి, ముక్కు పిండి వసూలు చేయడం రివాజుగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. బమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి గా మార్చడంలో సిద్ధహస్తులైన కొంతమంది గ్రామ రెవెన్యూ సహాయకుల పనితీరుపై పై స్థాయి అధికారులు ఒక కన్ను వేసి వీరి బారి నుండి ప్రజలను రక్షించాలని పలువురు కోరుతున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే అధికారులందరూ ఇటీవల బదిలీపై వచ్చిన వారే కావటంతో అధికారులు సైతం విచారణకు వీరి మీద ఆధారపడటంతో ఈ అవకాశాన్ని బోనస్ గా మార్చుకుంటున్నారు కొంతమంది వీఆర్ఏలు. క్షేత్రస్థాయి విచారణ సమయంలో లోతుగా దర్యాప్తు జరిపి అర్హులైన వారందరికీ న్యాయం చేసి వీరి పనితీరుపై ఒక కన్ను వేయాలని పలువురు కోరుతున్నారు.




