మునిపల్లి, మే 13, జనంసాక్షి : ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో ఓ 10వ తరగతి విద్యార్థి ఫలితాలను టెన్త్ బోర్డు నిలిపివేసింది. వివరాల్లోకి వెళితే మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన పడకంటి మల్లికార్జున్ అనే 10వ తరగతి విద్యార్థి సైన్స్ పరీక్ష రోజున ఉదయం పూట భౌతిక రసాయన శాస్త్రం పరీక్ష రాయగా, మధ్యాహ్నం జీవశాస్త్రం పరీక్ష రాసారు. అయితే విద్యార్థి హడావిడిలో జీవశాస్త్రం 10 మార్కులకు సంబంధించిన ఆబ్జెక్ట్ పేపర్ ను ఆన్సర్ షీట్ తో టై చేయకుండా ఇంటికి తెచ్చుకున్నారు. అయితే ఎగ్జామ్ పూర్తి అయ్యాక ఆన్సర్ షీట్స్ ను, ఆబ్జెక్ట్ పేపర్ తో టై చేసారా లేదా అని నిర్దారించుకున్నాకే ఇన్విజిలేటర్ విద్యార్థి నుంచి పేపర్ తీసుకోవాలి. మళ్ళీ ఆన్సర్ షీట్స్ సీల్ చేసే ముందు కూడా మరోసారి ఇన్విజిలేటర్ తో పాటు ఎగ్జామ్ సెంటర్ సూపర్డెండెంట్ ఇతర అధికారులు పరీక్ష రాసిన విద్యార్థుల పేపర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయని తేల్చుకున్నాకే సీల్ చేయాలి. అధికారులు ఇవేమి పట్టించుకోకుండా విద్యార్థి నుంచి కేవలం ఆన్సర్ షీట్ తీస్కొని ఇంటికి పంపించారు. ఈ ఘటనను పరీక్ష జరిగిన నుంచి ఇప్పటి వరకు అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే 10వ తరగతి రిజల్ట్స్ రావడంతో సదరు విద్యార్థి ఫలితాలు వెబ్ సైట్ లో నిలిపివేసినట్లు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆబ్జెక్ట్ పేపర్ ఏమైంది?
నా కొడుకు మల్లికార్జున్ సైన్స్ పరీక్ష రాసి పొరపాటున ఇంటికి తెచ్చిన ఆబ్జెక్ట్ పేపర్ ను తరువాత రోజు ఎగ్జామ్ సెంటర్ మునిపల్లి మోడల్ స్కూల్ లో అధికారులకు ఇచ్చాము. ఆ ఆబ్జెక్ట్ పేపర్ ను బయోసైన్స్ ఆన్సర్ షీట్ తో జత చేస్తామని అధికారులు చెప్పారు. తర్వాత మాతో లెటర్ రాయించుకున్నారు. మాద్వారనే పొరపాటు జరిగినట్లు మరో లెటర్ రాయించుకొని 10వ తరగతి బోర్డకు పంపించారు. ఫలితాలు వచ్చిన రోజు మా కొడుకు రిజల్ట్ రాలేదు. స్కూల్ సార్లకు అడిగితే వారం తర్వాత పాఠశాలకే టెన్త్ బోర్డు రిజల్ట్స్ పంపిస్తుందని చెప్పారు. నా కొడుకు రిజల్ట్స్ రాకపోవడంతో ఆందోళనగా ఉంది. ఆబ్జెక్ట్ 10 మార్కులు కలిపి పాస్ చేయాలి. పెండింగ్ లో పెట్టిన ఫలితాలను వెంటనే విడుదల చేయాలి. నా కొడుకు నష్టపోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి.
– పడకంటి బస్వరాజు, విద్యార్థి తండ్రి




