ఇరాన్‌లో కూలిన సైనిక విమానం

– 10మంది మృతి

తెహ్రాన్‌, జనవరి14(జ‌నంసాక్షి) : ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. సైనిక విమానం కూలి 10మంది మృతిచెందిన విషాధ ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లో సైన్యానికి చెందిన ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఆ దేశ విూడియా సమాచారం ప్రకారం విమానంలో ఉన్న 10మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇరాన్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి రీజా జాఫర్జాదేహ్‌ అక్కడి విూడియాకు వెల్లడించారు. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్‌ రాజధాని బిషెక్‌ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్‌ విమానం వేరే రన్‌వేపై దించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.

విషయం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశంలో భారీ ఎత్తున పొగ వ్యాపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హెలికాప్టర్‌, అంబులెన్స్‌తో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.