ఈనెల 21 వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తింపుకు ప్రజలు సహకరించాలి
* వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్
టేకులపల్లి, డిసెంబర్ 5 (జనం సాక్షి): జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి మండలంలో ఈనెల 6వ తారీకు నుండి 21వ తారీకు వరకు అనుమానిత కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని స్థానిక వైద్యాధికారి డాక్టర్ మెంతెన విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉదయం 7 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ప్రతిరోజు 20 గృహాల చొప్పున సర్వే చేసి ప్రతి కుటుంబ సభ్యుడిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత లక్షణాలైన స్పర్శ లేని,ఎర్రని రాగి రంగు, గోధుమ రంగు గల మచ్చలు ఉన్న వారిని కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, మొద్దు బారి ఉన్నచో అలాంటి వారిని గుర్తించి వైద్యాధికారిచే నిర్ధారణ చేపట్టడం జరుగుతుంది అన్నారు. కాబట్టి ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ మెంతెన విద్యాసాగర్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




