ఉక్కు పరిశ్రమల ఏర్పాటులో నిర్లక్ష్యం
నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు
కొత్తది రాకున్నా.ఉన్నది అమ్మడం దారుణం
విశాఖపట్టణం,మే24 (జనంసాక్షి):దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం. అలాగే ఈ విషయంలో కొంత నష్టం లేదా కష్టం కలిగిన యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలి. అంతేగానీ వీటి ఏర్పాటు సాధ్యం కాదనుకుంటే దేశంలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించిన కేంద్రం తీరు నిరుద్యోగులను వంచించేలా ఉంది. అలాగే స్థానకంగా లభ్యమవుతున్న ముడిసరుకుని విదేశాలకు తరలిస్తున్న తీరును అడ్డుకునేలా లేదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదంటూ సెయిల్ 2014 డిసెంబర్‌లో ఇచ్చిన నివేదికను 2018 జూన్ 13న సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడంలోనే కేందప్రభుత్వ దగా స్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌ఐఎన్‌ఎల్, ఎంఎంటిసి, మెకాన్ సంస్థల ప్రతినిధులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను 2016 అక్టోబర్‌లో నియమించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలున్నాయనీ, అనంతపురం గనుల ఖనిజం నాణ్యత ఎక్కువనీ మెకాన్ సంస్థ నిర్ధారించింది. కడప ఉక్కు కర్మాగారానికి ఆ ఖనిజ నిక్షేపాలను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతనూ తెలిపింది. వీటన్నిటి ఆధారంగా కడప ఉక్కు కర్మాగార ఏర్పాటు సాధ్యమేనని మెకాన్ సంస్థ ఈ ఏడాది సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయినా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో 2017 డిసెంబర్‌నాటి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం గురించి మాత్రమే పేర్కొనడం వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అన్నది గమనించాలి. ఇలాంటి విషయాల్లో నాలుగేళ్లుగా కాలయాపన చేసి చివరి సంవత్సరం చేతులెత్తేయడం ద్వారా బృహత్తర లక్ష్యాన్ని దెబ్బతీయడం కాకా మరోటి కాదు. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉన్న అవకాశాలను దెబ్బతీయడం తప్ప
మరోటి కాదు. సామాన్య ప్రజలనేగాక న్యాయ వ్యవస్థనూ మోడీ సర్కారు పక్కదారి పట్టించందనే అనుకోవాలి. కడప ఉక్కు విషయంలో మోసాన్ని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో నిరసించగానే కేంద ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపడమే. కడప ఉక్కుపట్ల కేంద్రం ఎంత ప్రతికూలంగా వుందో స్పష్టమవుతోంది. రైల్వే జోన్ ఏర్పాటుపైనా ఎన్‌డిఎ ప్రభుత్వం దోబూచులాడుతూనేవుంది. గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చేపట్టవలసిన చట్ట సవరణను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మూడేళ్లు మాత్రమే ఇచ్చి, తర్వాత నిలిపివేసింది. పోర్టు ఏర్పాటుకూ తిలోదకాలిచ్చింది. ఇలా అనేక అంశాల్లో తెలుగు ప్రజలపట్ల మోడీ సర్కారు ద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది. సంకుచిత స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు విరుద్దంగా అభివృద్ది సాగాలి. అప్పుడే ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాకారం కాగలదు. అలాగే విశృాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. అక్కడ మరిన్ని ఉద్యోగాల కల్పన చేసి, ఉక్కు గనులను కేటాయించాలి. ఎందరో త్యాగ ఫలితంగా ఏర్పడ్డ ఉక్కు ఫ్కాక్టరీని అమ్మడా దారుణం కాక మరోటికాదు.