వరంగల్ ఈస్ట్, మే 27 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టుల క్రీడా పోటీలలో భాగంగా శనివారం క్రికెట్ పోటీలను దేశాయిపేటలోని సికేఎం కళాశాల మైదానంలో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఫ్రెండ్లీ మ్యాచ్ క్రికెట్ పోటీలో భాగంగా గాడిపెళ్లి మధు, తుమ్మ శ్రీధర్ రెడ్డి జట్ల మధ్య పోటీ నిర్వహించగా తుమ్మ శ్రీధర్ రెడ్డి జట్టు విజయం సాధించింది. నిత్యం వార్తల కవరేజీలో ఒత్తిడికి గురవుతున్న ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా విలేకరుల మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల నూతన ఉత్తేజం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. చక్కని క్రీడా దుస్తులు ధరించి వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టులు గ్రౌండ్ లోకి రావడంతో కళకళలాడింది. వేసవి కావడంతో ఉదయం నుంచే క్రీడలు నిర్వహించేలా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్రీడాకారులకు అల్పాహారం, తాగునీరు మొదలైన సౌకర్యాలను కలిగించారు.




