పెనుబల్లి, జూన్ 7(జనం సాక్షి)నీళ్లు ,నిధులు, నియామకాలనే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి ఏ వెంకన్న, పార్టీ మండల కార్యదర్శి బీరెల్లి లాజరు ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పెనుబల్లి మండల కేంద్రంలో వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ప్రజా ఆకాంక్షల దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీఓ లకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఏ వెంకన్న , లాజరు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతకు నిరాశ మిగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను కెసిఆర్ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందన్నారు. లక్షల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగులను వంచిందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రైతుల రుణమాఫీ, పోడు భూముల పట్టాలు, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీలు నీటి మూటలుగానే మిగిలాయని విమర్శించారు. వందల కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరిపే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో వసంత వెంకటి, వెంకట నరసయ్య, వల్లేబోయిన వెంకటేశ్వరావు, కట్ల ప్రసాదు, యాట మాధవరావు, కొండా కాంతారావు,కోనేటి నాగేశ్వరావు, కన్నేపోగు నాగయ్య, పొదియా తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల బలిదానాలను అపహాస్యం చేస్తున్న ప్రభుత్వం




