Tuesday, 3 November 2026

ఉద్యోగాలు తీసేస్తాననడం సరికాదు

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ
హైదారాబాద్‌, అక్టోబర్‌5 (జనంసాక్షి):  సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తీసేస్తాననడం సీఎం కేసీఆర్‌కు తగదని కాంగ్రెస్‌ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం గాంధీ భవన్‌ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్‌ ఉద్యంలో ఒకలా ఇప్పుడు మరొకలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు తన పూర్తి మద్దతు ఉంటుందని షబ్బీర్‌ అలీ తెలిపారు. పది నెలల తర్వాత కేసీఆర్‌ ప్రధాని మోడీని కలిశారని, బయటకు చెప్పేదొకటి, లోపల మాట్లాడిందొకటని షబ్బీర్‌ అన్నారు. తమ తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని మోడీని కేసీఆర్‌ వేడుకున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి రిజర్వేషన్ల గురించి మాట్లాడక పోవడంతోనే? కేసీఆర్‌ మోసపూరిత బుద్ధి బయటపడిందని అన్నారు. 22డిమాండ్లలో రిజర్వేషన్లు అంశం ఎందుకు లేదని ప్రశ్నించారు. హుజూర్‌ నగర్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులను స్థానికులు అడ్డుకోవాలని షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్‌ కు
ఉద్యోగులు, ఆర్టీసీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎలర్జీ అని అన్నారు. కేటీఆర్‌..ది నోరా.. మోరా అని అని ఘాటుగా విమర్శించారు. కేటీఆర్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని, సీపీఐని తోకపార్టీ అని అన్న కేటీఆర్‌, ఇప్పుడు అదేతోక పార్టీ తోనే జత కట్టారనిషబ్బీర్‌ అలీ విమర్శించారు.