Tuesday, 3 November 2026

ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి  ధనుంజయ నాయుడు

హుజూర్ నగర్ మే 29 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ విధుల్లో నుంచి తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన శ్రీనివాస్ పురంలో, ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ 2019 వ సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా జరగడం లేదని, 2019 నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండానే ఉపాధి హామీ పథకం పనులను ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి చెప్పినట్టుగానే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. 2019 నుంచి 2021 వరకు అర్హత లేని ఒక వ్యక్తి ద్వారా పనులు చేయిస్తున్నారని, గ్రామంలో పనిచేసిన కొన్ని శ్రమ శక్తి సంఘాలకు వేతనాలు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 2022 ఆగస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నదని, సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ ను కూడా తిరిగి విధులోకి తీసుకోవాలని చెప్పినప్పటికీ ఈ గ్రామంలో అమలు కాకపోవడం విడ్డూరంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఉపాధి పనుల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకట్ట వేయాలని, 2003 సంవత్సరంలో గ్రామంలో ఇండ్లు లేని వారిని గుర్తించి 186 మందికి పట్టాలు ఇచ్చారు కానీ, ఇంతవరకు స్థలం, హద్దు, బందులతో లబ్ధిదారులకు చూపించలేదని, ఇటీవల కాలంలో మళ్లీ 294 మందికి పట్టాలు ఇచ్చారని, కేవలం నెంబర్లు వేసి కాగితాలు ఇస్తున్నారు తప్ప ఫీల్డ్ మీదకు వచ్చి స్థలం చూపించిన పాపాన పోలేదని, ఉత్త కాగితాలతో ఏం ఒరుగుతుందని, లబ్ధిదారులైన 294 మందికి స్థలం చూపించి ఇంటి నిర్మాణం కొరకు మూడు లక్షల రూపాయలు కేటాయించి ప్రభుత్వంవారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.