– వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనుంజయ నాయుడుహుజూర్ నగర్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నంలో భాగంగా ఆయన మాట్లాడుతూకేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి బడ్జెట్లో కూడా ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తూ వస్తున్నారని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తగ్గించారని దానివల్ల కూలీలకు రోజుకు 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మాత్రమే కూలి వస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఎనిమిది సంవత్సరాలుగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావంతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ఒకపక్క పేదవాడికి అవసరమయ్యే వాటి ధరలు పెంచుతూ, మరోపక్క కూలి ధరలు తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రెక్కలు తప్ప జీవించడానికి ఎలాంటి ఆధారాలు లేని నిరుపేదలైన వ్యవసాయ కూలీల జీవితాలు చిద్రమైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలు పనిచేసే చోట వారికి అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉంచాలని, త్వరలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగేందుకు మంచినీరు టెంట్లు, మెడికల్ కిట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మొదలైనవి అందుబాటులో ఉంచాలని, వికలాంగులకు వారు చేయగలిగే పనిని మాత్రమే చూపించాలని, పనిప్రదేశంలో ఏదైనా ప్రభావం జరిగితే వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. ఆయన వెంట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జడ వెంకన్న, ఉపాధి కూలీలు వెంకటాచారి, నాగమణి తదితరులు ఉన్నారు.




