బాగ్‌లింగంపల్లి,హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ-2 ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. శుక్రవారం సుందరయ్య కళానిలయంలో గ్రామీణ ఉపాధి మేట్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసేందుకు భూస్వామ్య, పెట్టుబడిదారులు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకునేందుకు తాము దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని రాఘరావులు చెప్పారు. కేంద్రం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసందానం పేరుతో పెట్టుబడిదారులను మెప్పించే ప్రయత్నం చేస్తోందన్నారు. కార్పొరేట్ వ్యవసాయ చట్టం కనుక అమలుచేస్తే వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వామపక్షాల బలం పార్లమెంటులో లేదనే ప్రభుత్వం ఇలాంటి దురాలోచన చేస్తోందన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, వెంకట్, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




