ఉప్పొంగిన మూసీ

` జంటజలాశయాలకు భారీగా వరద
` నీటిని దిగువకు వదిలిన అధికారులు
` మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ వంతెనలపై రాకపోకలు బంద్‌
హైదరాబాద్‌,సెప్టెంబరు 28(జనంసాక్షి):గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. దీంతో కిందిప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, వద్ద వంతెనను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు చిన్నారుల రావొద్దని హెచ్చరించారు. చాదర్‌ఘాట్‌, శంకర్‌నగర్‌ ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ దేవేందర్‌, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షణలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కోఠి`చాదర్‌ఘాట్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హిమాయత్‌ సాగర్‌ జలాశయంలో రెండు అడుగుల మేర ఎనిమిది గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గండిపేట్‌ జలాశయం ఆరు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. హిమాయత్‌ సాగర్‌, గండిపేట్‌ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో మూసీప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 7040.73 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి,ఎడమ కాలువలకు 180.72 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 640.40 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ వంతెనలపై రాకపోకలు బంద్‌
హిమాయత్‌ సాగర్‌ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నాలుగు గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హిమాయత్‌ సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌ నీటి విడుదలతో మూసరాం బాగ్‌ బ్రిడ్జి వద్ద అప్రమత్తం చేశారు. మూసీ నదికి భారీగా వరద ఉధృతి పెరిగింది. మూసారంబాగ్‌ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా మూసారాంబాగ్‌ వంతెనపై రాకపోకలు నిలిపివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. గోల్నాక న్యూ బ్రిడ్జి దారిలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అలాగే చాదర్‌ఘాట్‌ చిన్న వంతెనపైకి వాహనాలకు రాకుండా చర్యలు చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతానికి చిన్నారులు రావొద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో చాదర్‌ఘాట్‌, శంకర్‌నగర్‌, మూసారాంబాగ్‌, ఓల్డ్‌ మలక్‌పేటలో హైఅల్టర్‌ ప్రకటించారు. మూసీ వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. మూసీలో క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడు నీటిమట్టాన్ని పరిశీలిస్తున్నారు. ప్రవాహాన్ని అంబర్‌పేట సర్కిల్‌ డీసీ వేణుగోపాల్‌, మలక్‌పేట ట్రాఫిక్‌ సీఐ జ్యోత్స్న పరిశీలించారు.