Monday, 2 November 2026

ఊరేగింపులో టాటాఏసీ బీభత్సం

– ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు
హైదరాబాద్‌, మే3(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలోని వారాసిగూడలో టాటా ఏస్‌ వాహనం బీభత్సం చేసింది. ఊరేగింపుపైకి దూసుకురావడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవగా.. మరో నలుగురు
తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు బదులు ఓ మైనర్‌ బాలుడు వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారాసిగూడ చౌరాస్తాలో గురువారం  రాత్రి ఉర్సు ఊరేగింపు నిర్వహిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి టాటా ఏస్‌ వాహనం ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ బీభత్సానికి చూస్తుండగానే ఓ వ్యక్తి విగతజీవిగా మారిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. ఆటో నడిపిన మైనర్‌ బాలుడికి డ్రైవింగ్‌ రాదని పోలీసులు గుర్తించారు. ఆందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ తొక్కడంతో వాహనం జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఊరేగింపులో ఆనందం ఒక్కసారిగా ఆవిరయ్యింది. ఊరేగింపు ముందు ఉన్న బ్యాండ్‌ బృందం సభ్యుడైన కొమురయ్య (50) అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన మరో మైనర్‌ బాలుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగినప్పుడు డ్రైవర్‌.. ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.