ఎజెండాలోని అంశాలు చర్చించకుండానే ఆమోదం..
అధికారపక్షం తీరుపై బీజేపీ ఆగ్రహం.
మున్సిపల్ ముందు నిరసన తెలిపిన బిజెపి ప్లోర్ లీడర్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, డిసెంబర్ 31. (జనంసాక్షి). మున్సిపల్ ఏజెండాలోని అంశాలను చర్చించకుండానే ఆమోదం తెలుపుతూ ఏకపక్షంగా వ్యవహరించిన అధికార పార్టీ తీరును నిరసిస్తూ బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సమావేశం అనంతరం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో ఎజెండాలోని 24 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా అంశాలు పూర్తిగా చదవకుండానే అధికార పార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలపడం దుబారం రేపింది. బిజెపి ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజు గౌడ్ అధికార పార్టీ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా ఎలాంటి చర్చ చేయకుండానే ఏకగ్రీవంగా అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించి ఆమోదిస్తూ తీర్మానం చేసుకోవడంపై మండిపడ్డారు. ప్రతిపక్షం చేసిన చర్చలు కూడా పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని అన్నారు. మెజార్టీ సభ్యులు ఉంటే ఏమైనా చేయొచ్చాఅని ప్రశ్నించారు. 24 అంశాల్లో కనీసం 8 అంశాలు కూడా పూర్తిగా చదవకముందే ఆమోదం తెలపడం విచిత్రంగా ఉందని అన్నారు. గతంలోనూ అనేక సమావేశాల్లోను ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి ఆమోదయోగ్యం కాదని వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో కౌన్సిలర్ భాస్కర్ పాల్గొన్నారు.బిజెపి కౌన్సిలర్లు అధికార పార్టీ తీరును నిరసిస్తూ నిరసనకు దిగడం చర్చనీయ అంశంగా మారింది.




