..
– అధికారులు ప్రజా ప్రతినిధులకు సహకరించాలి.
– సగానికి పైగా హాజరు గాని ప్రజాప్రతినిధులు.
– జెడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్. ఊరుకొండ, జనవరి 18 (జనంసాక్షి):
ఊరుకొండ మండలానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ముందస్తుగా ఎజెండాలో పొందుపరచాలని జెడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీపీ బక్క రాధజంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి జెడ్పి చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మండల స్థాయి అధికారులను అభివృద్ధి పనులపై ప్రశ్నించారు.
రేషన్ బియ్యం ప్రతి గ్రామంలో, పాఠశాలలో సన్న బియ్యం సరఫరా అయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులు తూతూ మంత్రంగా కాకుండా పూర్తిస్థాయిలో పనులు అమలయ్యేలా గ్రామ సర్పంచ్ లతో కలిసి అభివృద్ధి పనులు చేయాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యురాళ్లకు ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు మంజూరైన నిధులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు మండల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని, అభివృద్ధి పనులలో ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇచ్చి అందరు కలిసి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల సర్వసభ్య సమావేశానికి మండలంలోని ఐదు మంది సర్పంచులు, ఇద్దరు ఎంపిటిసిలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. కార్యక్రమంలో ఎంపీపీ బక్క రాధ జంగయ్య, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ ఖలీల్ పాషా, తహసిల్దార్ జాకీర్ అలీ, ఎంపిడిఓ ప్రభాకర్, ఎంపీఓ వెంకటేష్,
సర్పంచులు కొమ్ము రాజయ్య, అనిత నాగోజి, శివరాణి హరీష్, శ్రీను నాయక్, ఆంజనేయులు, ఎంపీటీసీలు కలిమిచర్ల గోపాల్ గుప్తా, ఈశ్వరమ్మ ముత్యాలు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ఎజెండా పూర్తి స్థాయిలో సమర్పించాలి




