Monday, 2 November 2026

ఎన్టీఆర్‌ పేరు మార్చరట ! రాజ్యసభలో అరుణ్‌జైట్లీ

11

న్యూఢిల్లీ, నవంబరు 26 (జనంసాక్షి) : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరును మార్చబోమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్‌ పేరే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.  ఎన్టీఆర్‌ పేరు పెట్టడంపై సభ్యుల నిరసనతో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశీయ టెర్మినల్‌ పేరు మార్చే ప్రసక్తే లేదని జైట్‌ఈ తేల్చి చెప్పారు.  రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని అరుణ్‌ జైట్లీ స్పష్టంచేశారు. రాజీవ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలేనని అన్నారు.  ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోకగజపతి రాజు మాట్లాడుతూ.. శంషాబాద్‌ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరే ఉందని తెలిపారు. దేశీయ టెర్మినల్‌కు గతంలో ఉన్న ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించామని రాజ్యసభలో వెల్లడించారు. ఈ పేరు మేము కొత్తగా పెట్టింది కాదని, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచామని తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఒక్క ప్రాంతానికి చెందిన వాడు కాదని, ఆయనకు అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులున్నారని తెలిపారు. దీనిపై విపక్ష సభ్యులు అనవసర రాద్దాంతం మానుకోవలని ఆయన హితవు పలికారు. దాంతో సభలో రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. పేరు మార్చడాన్ని తప్పుబట్టిన వారు… రాజీవ్‌ పేరు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

పేరు మార్పుపై కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌ పేరు మార్పుపై కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఫ్లపకార్డులతో నిరసన చేపట్టారు. ఒకే విమానాశ్రయానికి రెండు పేర్లు పెట్టడం సబబు కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. కేంద్ర పౌరవిమానయానశాఖ జారీ చేసిన జీవోను రద్దుచేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎంపీలు రాపోలు ఆనంద్‌భాస్కర్‌, కేవీపీ రాంచంద్రరావు, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

గన్నవరంకు ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోండి: రాపోలు

ఈ వివాదంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపి సభలో మాట్లాడుతూ.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పేరును మార్చొద్దని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగీవ్ర తీర్మానం చేసిందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ సభలో తెలిపారు. ఎన్టీఆర్‌ పేరును కావాలిస్తే గన్నవరం ఎయిర్‌పోర్టుకు పెట్టుకోండని సూచించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పేరు మార్చకపోతే సభను అడ్డకుంటామని ఆయన హెచ్చరించారు. ఆందోళనను తీవ్ర తరం చేస్తామని కూడాతెలిపారు.

ఎన్టీఆర్‌ పేరుపై వివాదం తగదు: టిడిపి

మహానేత ఎన్టీరామారావు పేరును శంషాబాద్‌ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు పెట్టడంపై కాంగ్రెస్‌ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెదేపా ఎంపీలు కొనకళ్ల నారాయణ, గరికపాటి రామ్మోహనరావు అన్నారు. పార్లమెంట్‌ వద్ద వారు విూడియాతో మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన ఎన్టీఆర్‌ను కాంగ్రెస్‌ నేతలు ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశీయ టెర్మినల్‌కు గతంలో ఉన్న ఎన్టీఆర్‌ పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సోనియాగాంధీ మెప్పు పొందేందుకే కాంగ్రెస్‌ నేతలు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

విమాన ప్రమాదాలపై మంత్రి వివరణ

ఒక పక్క సభలో ఎన్టీఆర్‌ పేరు శంషాబాద్‌ విమానాశ్రయంపై గొడవ కొనసాగతుండగానే విమాన ప్రమాదాలపై రక్షణ మంత్రి ప్రకటన చేశారు.  2011 నుంచి జరిగిన విమాన ప్రమాదాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. గడచిన మూడేళ్ళలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సుకు చెందిన 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌ లు కూలిపోయాయని, దేశానికి రూ.1,161 కోట్ల నష్టం వచ్చిందని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ రాజ్యసభకు తెలిపారు. ఈ ప్రమాదాలన్ని మనవ తప్పిదాలతో పాటు సాంకేతిక కారణాల వల్ల జరిగాయని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *