Thursday, 5 November 2026

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైకాపా వ్యూహాలు

ఎన్నికల రణంలోకి దిగనున్న వైఎస్‌ కుటుంబం?

రాయలసీమలో భారీ మార్పులతో పట్టునిలుపుకునే యత్నాలు

కడప,నవంబర్‌10(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల నాటికి వైఎస్‌ కుటుంబ సభ్యులను రాజకీయాల్లో పూర్తిస్థాయిలో తీసుకుని వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. జగన్‌కు తోడు వైఎస్‌ భారతి, జయమ్మ, షర్మిల, వైఎస్‌ వివేకానంద ఇలా అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించేలా ప్లాన్‌ చేస్తున్నారు. అధికార పార్టీ ఎత్తుగడలను గమనించి ఎప్పటికప్పుడు వ్యూహంతో సాగాలని నిర్ణయించారని తెలుస్తోంది. తమపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను,ఎంపిలను అధికార పార్టీకి చేర్చుకోవడంతో వైకాపా పూర్తిగా బలహీనపడింది. దీంతో ఇక టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించి పార్టీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చేలా జగన్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి మొదలయిన జగన్‌ పాదయాత్ర చివరిదశకు చేరుకుంది. మొత్తంగా కుటుంబ సభ్యులంతా ఇక రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. జగన్‌ పాదయాత్ర ఆరంభం కార్యక్రమం స్వాగత తోరణాల్లో జగన్‌, భారతిల ఉమ్మడి ఫొటోలు ఫ్లెక్సీలుగా వెలిశాయి. జగన్‌ భార్యగా భారతి సాక్షి విూడియా చైర్మన్‌ గా కొనసాగుతున్నారు. సాక్షికి కేవలం స్లీపింగ్‌ చైర్మన్‌ గా కాకుండా యాక్టివ్‌ చైర్మన్‌ గా వ్యవహరిస్తున్నారు. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా భారతి చేతిలోనే ఉన్నాయని అంటారు. అంటే.. వైఎస్‌ సోదరుల కుటుంబాలతో మమేకం కావడం తదితర బాధ్యతలు కూడా భారతి చేతిలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరకంగా వైఎస్‌ కుటుంబంలో భారతి పెద్దిక్కులా అన్నీ చక్కబెడుతున్నారని సమాచారం. అలాగే ఆమె ప్రత్యక్ష రాజకీయాల వైపు కూడా ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఎలాగూ కడప ఎంపీ స్థానం విషయంలో జగన్‌ మార్పు చేయనున్నాడనే మాట వినిపిస్తోంది. అక్కడ నుంచి భార్యను రంగంలోకి దించినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదేమో. షర్మిలను ఒంగోలు ఎంపీ సీటు నుంచి బరిలోకి దించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే విజయమ్మను ఎంపిగానా లేదా ఎమ్మెల్యేగానా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా అందరూ వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేస్తున్నారు. అలాగే సీమ రాజకీయాల్లోని వాళ్లే సీట్లలో మార్పు చేర్పులు చేసుకోనున్నాయి. అటు కడప ఎంపీ సీటుకు, ఇటు రాజంపేట ఎంపీ సీటుకూ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి కడప నుంచి భారతి లేకుంటే వైఎస్‌ షర్మిల రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినాష్‌ రెడ్డిని మరోరకంగా సర్దుబాటు చేసి.. షర్మిలను కడప నుంచి ఎంపీగా పోటీ చేయించనున్నాడరని సమాచారం. షర్మిల పోటీ చేయడం అయితే ఖాయమే.. అది కడప లేదా, ఒంగోలు లేదా విశాఖపట్నం అన్న ప్రచారం వైకాపా శ్రేణుల్లో ఉంది. ఇక రాజంపేట నుంచి కూడా మిథున్‌ రెడ్డి స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిథున్‌ ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇక నంద్యాల ఎంపీ సీటు నుంచి గెల్చిన ఎస్పీవై రెడ్డి టిడిలో చేరినందున వైకాపా ఎవరిని బరిలోకి దింపుతుందనేది కూడా ఆసక్తిదాయకమైన అంశమే. మొత్తానికి వైకాపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.రాజకీయంగా దెబ్బతిన్న వైకాపా వ్యూహాలతో వచ్చే

ఎన్నికలు రాయలసీమలో ఆసక్తిదాయకమైన రాజకీయ సవిూకరణాలకు తెరలేపడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. కడపజిల్లాలో చాలా మార్పులే ఉంటాయని అంటున్నారు.