వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న లోకేశ్
బాలయ్యను లోక్‌సభకు పంపేలా ప్రణాళిక
అమరావతి,నవంబర్10(జనంసాక్షి): చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. దీనికి అనగుణంగా పార్టీలో కూడా తనయుడికి మరింత బాధ్యతలను అప్పగించి, కేంద్రంలో ఎక్కువ సమయం కేటాయించేలా బాబు ప్రణాళిక చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా అనంతపురం రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ చర్చ సాగుతోంది. ప్రస్తుతం హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయ్య ఎంపిగా వెల్లనున్నారన్న ప్రచారం సాగుతోంది. తన స్థానంలో హిందూపురం నుంచి తన అల్లుడు, చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను రంగంలోకి దింపనున్నారని ప్రచారం సాగుతోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ చర్చ సాగడం విశేషం. ఒకవేళ కుప్పం నుంచి లోకేశ్‌ను పోటీకి దింపడమా అన్నది కూడా బాబు ఆలోచనగా ఉందని అంటున్నారు. లేదా చంద్రగిరి నుంచి మళ్లీ బాబు పోటీ చేస్తారా అన్నది కూడా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు చంద్రగిరికి మారితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. తనయుడిని కుప్పం నుంచి పోటీ చేయించాలనేది చంద్రబాబు నాయుడి వ్యూహంగా కనిపిస్తోంది. తనయుడికి కుప్పం అయితే బాగుంటుందని భావిస్తున్న చంద్రబాబు నాయుడు చంద్రగిరి తనకోసం ఉపయోగించుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో ఆయన ఇక్కడి నుంచే ప్రాతినిద్యం వహించారు. ఆ తరవాత కొంతకాలం ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ప్రాతినిధ్యం వహించారు. తనయుడిని ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి మంత్రిని చేసిన చంద్రబాబు నాయుడు, వచ్చే ఎన్నికల్లో పోటీలో దింపడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో రాటుదేలేలా చేయాలని చూస్తున్నారు. దీనికోసం చాలా నియోజకవర్గాలు పరిశీలనలో ఉన్నాయి. సొంత సామాజికవర్గం జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాలను బాబు పరిగణనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాకాని పక్షంలో కుప్పం నుంచినే రంగంలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాబుకు నలభైవేల పైచిలుకు మెజారిటీనే సొంతజిల్లా నుంచి వస్తోంది. బహుశా లోకేష్ రాజకీయ ప్రవేశానికి ఇంతకు మించిన ప్లేస్ ఉండకపోవచ్చు. అనంతపురం ఎంపీ సీటుకు అటు తెలుగుదేశం, ఇటు వైకాపా కొత్త క్యాండిడేట్లను చూడాల్సిన అవసరం ఉంది. ఇక పోటీ చేయనని టీడీపీ నేత, ఎంపీ జేసీ ప్రకటించినా అది ఎంతవరకు అన్నది చూడాలి. అక్కడ నుంచి ఆయన తనయుడు పోటీలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బాబు అందుకు ఒప్పుకుంటాడా? జేసీల అవసరం బాబుకు ఇప్పుడు ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో వారిని పూర్తిగా పక్కన పెట్టినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు. దీంతో బాలయ్యను అనంత నుంచి దింపితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా టిడిపిలో ఉంది. అలాగే హిందూపురం నుంచి కూడా కీలకమార్పులు ఉండవచ్చంటున్నారు. హిందూపురం ఎంపీ టికెట్‌ను త్యాగం చేయడానికి నిమ్మల కిష్టప్ప సిద్ధంగా ఉన్నాడని సమాచారం. అక్కడ నుంచి బాలయ్య పోటీ చేయవచ్చని.. హిందూపురం ఎమ్మెల్యేగా నారా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు బరిలోకి దిగే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తోంది. కుప్పం నుంచి కుదరకపోతే లోకేష్‌కు రెండో ప్రత్యామ్నాయం హిందూపురమే అంటున్నారు.
అల్లుడి కోసం ఈ సీటును త్యాగంచేసి.. బాలయ్య హిందూపురం ఎంపీ సీటుకు వెళ్లవచ్చని అంటున్నారు. మొత్తంగా నారా, నందమూరి ప్యామిలీలకు అనుకూలంగా సీట్ల సర్దుబాటు ఉంటాయన్నది అర్థం అవుతోంది.




