Thursday, 5 November 2026

ఎన్నికల కోసం భారీభద్రత

హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర బలగాలు

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో భద్రత కోసం 25 ప్లటూన్ల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 307 ప్లటూన్ల బలగాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు కోరగా.. 300 ప్లటూన్లను పంపేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అంగీకరించింది. ఛత్తీస్‌ గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల తరువాతే పూర్తిస్థాయి

బలగాలు రానున్నాయి. ఇప్పటికే 70 వేల మంది రాష్ట్ర పోలీస్‌ బలగాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఐదు రోజుల కొరకు రాష్టాన్రికి మరో 25 వేల మంది పోలీసులు రానున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 98 ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 18 కేసులు పరిష్కరించగా.. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నవి 48 ఉన్నాయి. 12 ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు పంపించగా, విచారణ పూర్తి చేసి రిపోర్టుల కోసం వేచిచూస్తున్నవి 20 కేసులు ఉన్నాయి.

నామినేషన్ల సందర్భంగా ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించేందుకు 50 మంది పరిశీలకులు హైదరాబాద్‌ చేరుకున్నారు. రేపు మరో ముగ్గురు పరిశీలకులు రానున్నారు. వారు రెండు నుండి మూడుసార్లు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఎన్నికల ముందే డిసెంబర్‌ మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు రాష్టాన్రికి రానున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 77.26 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.5.32లక్షల విలువ చేసే 2,63,341 లీటర్ల మద్యం ఉంది.