Thursday, 5 November 2026

ఎమ్మెల్యే బెదిరింపులకు మా కార్యకర్తలు భయపడరు

ఎమ్మెల్యే బెదిరింపులకు మా కార్యకర్తలు భయపడరు.
-ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులుంటాయో తెలియని ఎమ్మెల్యే మర్రి.
-నియోజకవర్గ దళితుల అసైండ్ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే.
-గ్రామాల్లో రచ్చబండ పెట్టి ప్రజా సమస్యలను తీర్చాలి.
-ప్రజా గోస-బిజెపి భరోసా యాత్రను జయప్రదం చేయండి.
-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి.
-షర్మిలపై టీఆర్ఎస్ గుండాల దాడి ప్రజాస్వామికం.
-బిజెపి పార్లమెంట్ మాజీ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి.
-సామాన్యులు బాగుపడితే ఓర్వలేని ఎమ్మెల్యే.
-బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోల్ దాస్ రాము.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్29 (జనం సాక్షి):

నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గ్రామాలలో తిరుగుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని కానీ మా కార్యకర్తలు ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడరు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెడనూరి దిలీప్ ఆచారి హెచ్చరించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూల్ పేరిట ప్రజల ముందు మరొకసారి కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, కానీ ఆయన కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, మరొక సారి ప్రజలు మోస పోరు అని అన్నారు.దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని మాట ఇచ్చి,ఇచ్చిన మాట నిలబెట్టు కోకుండా నియోజకవర్గ దళితుల అసైన్డ్ భూములపై కన్నేశారని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించారు.నియోజకవర్గంలో నిరుపేదలకు ఇస్తామన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. గ్రామాలలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలను గుర్తించి వాటిని తీర్చాలని డిమాండ్ చేశారు.ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆయన చేసిన నియోజకవర్గ అభివృద్ధి ఏంటో బయట పెట్టాలని అన్నారు. సామాన్యుల బలహీనతలతో ఆటలాడుతున్నారని, ఎమ్మెల్యే అనుయాయులను ప్రేరేపించి పెయిడ్ గుండాలచే సామాన్యుల పై దాడులు నిర్వహించడం సరికాదని సూచించారు. మంగలవారం ఉదయం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని వసంతాపూర్ గ్రామంలో రంజిత్ అనే బిజెపి కార్యకర్త ఇంటికెళ్ళి అతన్ని భయపెడుతూ టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని తమ వెంట నడవాలని అనడం విడ్డూరంగా ఉందంటూ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తతో మాట్లాడుతున్న వీడియోలు లాప్టాప్ లో విలేకరుల సమక్షంలో చూయించారు.బిజెపి కార్యకర్తలు సైనికులు అని ఇతరుల ప్రలోభాలకు లొంగరని గుర్తించుకోవాలని హెచ్చరించారు.ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయో తెలువనే తెలవదు అని ఎద్దేవా చేశారు.గ్రామాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలతో ఫిబ్రవరి 30 వరకు కాలువల ద్వారా పంటలకు నీళ్లు అందిస్తామని పదేపదే చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలిచేది బిజెపి పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు.బుధవారం మండల పరిధిలో ప్రజా గోస-బిజెపి భరోసా యాత్ర జరుగుతుందని,ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల ర్యాలీ ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంఎల్సీ బిజెపి రాష్ట్ర నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ హాజరవుతారని తెలిపారు.ఈ యాత్ర తూడుకుర్తి నుండి ప్రారంభమై అన్ని గ్రామాల గుండా ప్రజా సమస్యలను గుర్తిస్తూ,టిఆర్ఎస్ పార్టీ అన్యాయాలు, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.సాయంత్రం గగ్గలపల్లి గ్రామంలో ముగింపు సభ ఉంటుందని అన్నారు.
పార్లమెంట్ మాజీ కన్వీనర్:
బిజెపి పార్లమెంట్ మాజీ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై టిఆర్ఎస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని,ఈ దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని అన్నారు.మహిళల పై దాడులు చేసే సంస్కృతి టిఆర్ఎస్ పార్టీకి ఉందని ఈ పర్యావసానాలకు తగిన గుణపాఠం తప్పదు అని హితవు పలికారు. పార్టీలు ఏవైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. టిఆర్ఎస్ పార్టీ అంటే బందిపోటు రాష్ట్ర సమితి అన్న షర్మిల మాటలు బిజెపి బలపరుస్తుందని అన్నారు.
జిల్లా ఉపాధ్యక్షులు:
జిల్లా ఉపాధ్యక్షులు పోల్ దాసు రాము మాట్లాడుతూ సామాన్యులు బాగుపడు తుంటే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చూస్తూ ఓర్వలేక పోతారని అన్నారు.గ్రామాలలో వారి పార్టీ కార్యకర్తలు మరియు ఇతర పార్టీల నాయకులు తెల్ల దుస్తులు వేసుకుంటే మరియు కార్లల్లో తిరుగుతుంటే చూసి ఓర్వలేని మాటలు మాట్లాడతారని అన్నారు.అంటే సామాన్య ప్రజానీకం పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.ఈ సమావేశంలో మాజీ పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు పోల్ దాసు రాము,సీనియర్ నాయకులు తిరుపతయ్య,వెంకట్ రాములు,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదిరేపల్లి శ్రీనివాసులు,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సుధీర్ కుమార్ (చందు),ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కార్యాలయ కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.