Tuesday, 3 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదు వ్యూహం

పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయిస్తున్న టిఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఓ వైపు గ్రేటర్‌ ఎన్నికలకు నగారా మోగగా మరోవైపు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్‌ఇనకల హడావిడి సాగుతోంది. అధికార టిఆర్‌ఎస్‌ ఈ విషయంలో దూకుడుగానే పోతోంది.విద్యావంతులను కలవడం.. వారిని ఒప్పించడం.. ఓటర్లుగా నమోదు చేయించడం సవాల్‌తో కూడుకున్నదే అయిన..సభలూ సమవేశాలు పెట్టి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో బలమైన వ్యూహం తప్పదని గుర్తించిన టిఆర్‌ఎస్‌ ఆ మేరకు ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మళ్లీ బరిలో దిగుతు న్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. గతంలో ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈసారి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ కూడా బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్‌లో సైతం పోటీకి చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ బలమైన వ్యూహమే అనుసరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని విపక్షాలు లెక్కలు వేసుకుని ఎవరికి వారు ముందుకు పోతున్నారు.ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న అనేక మంది అప్పుడే ప్రచారం చేస్తూనే ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో దిగే వీలుంది. ఈ మేరకు ఆయన ఓటు నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతున్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను కలుపుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఓటర్లను నమోదు చేయించే పనిలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇదే స్థానం నుంచి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సైతం పోటీకి సై అంటున్నారు. ఆయన ఇప్పటికే గ్రామాల వారీగా గ్రాడ్యుయేట్లను కలుస్తున్నారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. లెప్ట్‌ పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించేశాయి. దుబ్బాక ఫలితం చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని విపక్ష పార్టీలు లెక్క లేసుకుంటున్నాయి. వీటన్నింటినీ అధిగమించి.. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నెగ్గుకు రావడం అసలు సిసలైన పరీక్షగా అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ దశలో బిజెపి కూడా ఈ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేపట్టింది.