మోగిన గ్రేటర్‌ ఎన్నికల నగారా

నోటిఫికేషన్‌తో పాటు షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 1న ఎన్నికలు..4న కౌంటింగ్‌

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు

24 ఉపసంహరణ…అదే రోజు గుర్తుల కేటాయింపు

మేయర్‌గా జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌

పాత డివిజన్ల మేరకే ఎన్నికలు నిర్వహణ

అసెంబ్లీ ఓటరు జాబితాతోనే ఎన్నికలు

ఇవిఎంల స్థానంలో బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఓటింగ్‌

విూడియా సమావేశంలో ప్రకటించిన కమిషనర్‌ పార్థసారథి

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి షెడ్యూల్‌ విడుదల చేశారు. నోటిషికేషన్‌తో పాటే షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. బ్యాలెట్‌ పద్దతిలో కోవిడ్‌ నిబందనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తారు. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా.. అసరమైతే

డిసెంబర్‌ 3న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో వార్డుల విభజన లేదని, 2016లో మాదిరిగానే 150 వార్డులకు, అవే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 52.09 శాతం పరుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల పక్రియను కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.

జనరల్‌ మహిళకు మేయర్‌ పదవి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించినట్లు ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి చెప్పారు. రెండు వార్డులు ఎస్టీలు, 10 వార్డులు ఎస్సీలకు, 50 బీసీలకు, జనరల్‌ మహిళ 44, మరో 44 స్థానాలు జనరల్‌కు కేటాయించినట్లు వివరించారు. ఇదిలావుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ అని, ఇక్కడ నివసించాలని దేశవ్యాప్త ప్రజలు కోరుకుంటారన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ముగస్తుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పాలకవర్గం గడువు ముగిసే మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం జీహెచ్‌ఎంసీ, రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాక తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఎలక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 150 వార్డుల్లో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ ఉంటాయని చెప్పారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నామని, ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బ్యాలెట్‌ను వైట్‌ పేపర్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.2500, ఇతరులు రూ.5వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు వచేయవచ్చని, ఫామ్‌ వెరిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

కరోనా నిబంధనల మధ్య ఎన్నికలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో వన్‌ ప్లన్‌ 3 చొప్పున సిబ్బంది ఉంటారన్నారు. ఎన్నికలకు 48వేల సిబ్బంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. 9238 పోలింగ్‌ స్టేషన్స్‌ డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌లో ఉండగా.. 21న తుది జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. గ్రేటర్‌లో 257

క్రిటికల్‌, 1439 సమస్యాత్మక, 1004 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికల్లో కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్‌కు ఐఎస్‌ఐ అధికారి చొప్పున ఆరుగురిని నియమించినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ఇద్దరు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారని, ఇందుకు 20నుంచి30వేల మంది సిబ్బందిని ఎన్నికలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 356 రూట్‌ మొబైల్‌ పార్టిస్‌, 131 స్టైక్రింగ్‌ పోర్స్‌, 44 స్పెషల్‌ స్టైక్రింగ్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ 48 గంటలకు ముందు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఓటర్‌కు ఓటరు స్లిప్స్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ నుంచి పోల్‌ స్లిప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు.కాగా గ్రేటర్‌ ఎన్నికల పోరుకు అధికార, విపక్షాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివిధ వర్గాలకు వరాలను ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలను డివిజన్ల బాట పట్టించింది. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలను వేగవంతం చేసింది. జీహెచ్‌ఎంసీకి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది.