ఫొటోలు : 1) ఆర్టీసీ ఎండీకి చేసిన ట్వీట్.2) గత ఏడాది ప్రారంభించిన బస్సు సర్వీస్ (ఫైల్ )
నెన్నెల, ఫిబ్రవరి 9, (జనంసాక్షి )నెన్నెల మండలం కొనంపేట గ్రామస్తులు ఎర్రబస్సు బస్ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది వర్షాకాలం రోడ్లు బాగాలేవన్న సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సు సేవలు నిలిపి వేశారు. బస్సు సేవలు పునఃప్రారంభం చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి ట్వీట్ చేయగా అయన పరిశిలించి ఏర్పాటు చేయాలని పలు మార్లు మంచిర్యాల డీఎమ్ కి సిఫారసు చేశారు. కానీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల 4నెలలు గడిచినా బస్సు సేవలు ప్రారంభం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సేవలు తిరిగి ప్రారంభించాలని గత 4 నెలల నుంచి ఆర్టీసీ డిపో మేనేజర్ కు పలుమార్లు వినతి పత్రాన్ని ఇచ్చి బస్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు కలిసినా ప్రయోజనం లేదని గ్రామస్తులు తెలిపారు. కేవలం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి ఒక్కో వ్యక్తి రాను పోను ప్రయివేటు వాహనాలు రూ. 200 వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. కోణంపేట నుంచి రోజుకు 10మంది విద్యార్థులు, 10 మంది సాధారణ ప్రయాణికులు, మన్నెగూడెం, కూర్మగూడెం, లంబాడితండా, నెన్నెల వరకు దాదాపుగా 40నుండి50 మంది ప్రయాణం చేసేవారు ఉన్నారని అన్నారు. ఈప్రాంతంలో ఎక్కువగా గిరిజన, పేదలే ఎక్కువగా ఉన్నారని, బస్ సౌకర్యం లేక కనీసం ఉన్నత విద్య కూడా అభ్యసించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్సు సేవలు కొనసాగించేలా చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.




