Thursday, 5 November 2026

ఏపీని అస్థిరపర్చేందుకు..  బీజేపీ కుట్ర పన్నుతుంది

– కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా సిద్ధమవ్వాలి
– మూడు పార్టీల మోసాలను ప్రజలకు చెప్పేందుకే ధర్మ పోరాట దీక్షలు
– 27న విజయనగరంలో ధర్మపోరాట దీక్ష
– తృతీయ కూటమి వచ్చే ఎన్నికల్లో పెను మార్పులు తీసుకొస్తుంది
– ఏపీ మంత్రి సుజయ్‌ కృష్ణారంగారావు
– నీకెందుకు ఓట్లేయాలో ప్రజలకు పవన్‌ చెప్పుకోవాలి
– మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
విజయనగరం, నవంబర్‌14(జ‌నంసాక్షి) : ఏపీని అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని, కేంద్రం కుట్రలకు వైసీపీ, జనసేనలు మద్దతుగా నిలుస్తున్నాయని, ఆ మూడు పార్టీల కుట్రలను బయటపెట్టేందుకు ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి సుజయ్‌ అన్నారు. విజయనగరం స్థానిక నాయుడు ఫంక్షన్‌ హాల్లో టిడిపి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి సుజయ్‌ కృష్ణారంగారావు మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇవ్వకుండా మోసం చేసి, రాష్ట్రాన్ని అస్థిరపరచాలని బీజేపీకుట్ర పన్నుతుందని విమర్శించారు. రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, వైసీపీ, జనసేనలు చూడలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ నెల 27 న విజయనగరంలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షకి లక్ష మంది వరకూ హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి, వైసిపి, జనసేన చేసే మోసాలను ప్రజలకి చెప్పేందుకు ధర్మ పోరాట దీక్ష విజయనగరంలో చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబు చేస్తున్న తృతీయ కూటమి వచ్చే ఎన్నికల్లో పెను మార్పులు తీసుకు వస్తుందని పేర్కొన్నారు.
నీకెందుకు ఓట్లేయాలో ప్రజలకు పవన్‌ చెప్పాలి – గంటా శ్రీనివాస్‌రావు
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రజలు ఎందుకు ఓట్లేయాలో పవన్‌ చెప్పాలని, ఎవరో ఇచ్చిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్‌ కి, పవన్‌ కళ్యాణ్‌ కి ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎందుకు అంత భయం అనేది చెప్పాలని అన్నారు. దేశంలో జరుగుతున్న స్కామ్‌ లపై ఏనాడైనా జగన్‌ మోహన రెడ్డి గాని, పవన్‌ కళ్యాణ్‌ గాని గట్టిగా అడగలేదని, అంత దమ్ము వాళ్లకి లేదని చెప్పారు.
గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం నష్టమని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం వాళ్లతో కలిసి వెళ్లి పోటీ చేశామని అన్నాడు. ఆనాడు ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి అన్ని నిధులు ఇస్తామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాలుగేళ్లుగా ఇచ్చిన హావిూలు నెరవేర్చకుండా తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ అత్యున్నత సంస్థలన్నిటినీ నాశనం చేశారని విమర్శించారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు రాక్షసుల్లాగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో ఉండడు, ఆంధ్రా పోలీస్‌లను నమ్మడు, ఆంధ్రాలో చిన్న సంఘటన జరిగితే హైదరాబాద్‌ వెళ్లి చూపించుకుంటున్న జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం.. ఆంధ్రాలో పాదయాత్ర చేస్తారు ‘ అని ఎద్దేవా చేశారు. జగన్‌ పాదయాత్రకి ఆంధ్రా పోలీసుల బందోబస్తు కావాలి.. ఆంధ్రా ఓట్లు కావాలి… అని మండిపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన చిన్న సంఘటనకి మాత్రం హైదరాబాద్‌ వెళ్లిన ఆంధ్ర పోలీసులకు జగన్‌ స్టేట్మెంటు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగలేని జగన్‌, పవన్‌ లు రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లడం విచిత్రంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని బీజేపీ నిలువునా ముంచింది – అశోక్‌ గజపతిరాజు
ఇచ్చిన హావిూలను అమలు చేయకుండా ఏపీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దారుణంగా మోసం
చేసిందని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు అన్నారు. దేశంలో నీతి నిజాయితీ పాలన నడవటం లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ మోసం చేస్తే.. నేడు బిజెపి మోసం చేస్తుందన్నారు. వైసిపి ఎప్పుడూ విమర్శించడం తప్ప వాళ్లు కొత్తగా రాష్ట్రం కోసం కష్టపడింది ఏమి లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపి స్థానాలు గెలిపించడం కోసం కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న విజయనగరంలో జరిగే సిఎం ధర్మ పోరాట దీక్షని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుజయ్‌ కృష్ణారంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పట్టణ, జిల్లా స్థాయి, మండలాల నాయకులు పాల్గొన్నారు.