ఏపీ సమస్యలపై జగన్కు అవగాహన లేదు
చంద్రబాబును తిట్టడమే జగన్కు తెలిసిన రాజకీయం
ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల
అమరావతి, జూన్13(జనం సాక్షి) : వైసీపీ, బీజేపీ, జనసేనపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ పోలవరం, అమరావతి రెండు సినిమాలని జగన్ అనడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఏపీ సమస్యలపై జగన్కు కనీస అవగాహన లేదని రుజువైందన్నారు. రెండు ప్రాజెక్టులను సినిమాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ, బీజేపీ, జనసేన విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.ప్రధానికి కన్నా ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక ¬దాను ఎందుకు చేర్చలేదని మంత్రి ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్ గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రాలను బలహీనపరిచి.. కేంద్రం బలపడాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నిధులతో కేంద్రం ఖజానా నింపాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర పెద్దలు ఒంటెద్దు విధానాలను మానుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు చేయూత అందించాలని మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు